మానని గాయం..అందని సాయం.. | 3years nagaram blow out | Sakshi
Sakshi News home page

మానని గాయం..అందని సాయం..

Published Mon, Jun 26 2017 10:55 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

మానని గాయం..అందని సాయం.. - Sakshi

మానని గాయం..అందని సాయం..

నగరం దుర్ఘటనకు మూడేళ్లు..
పీడ కలలా వెన్నాడుతున్న గ్యాస్‌ పైప్‌లైన్‌ విస్ఫోటం  
నేటికీ అమలు కాని వాగ్దానాలు
సాయం కోసం బాధితుల ఎదురుచూపులు
 
అది 2014 జూన్‌ 27వ తేదీ..సమయం ఉదయం ఆరు గంటలు.. నగరం గ్యాస్‌ కలెక్టింగ్‌ స్టేషన్‌(జీసీఎస్‌) ఎదురుగా పేలుడు శబ్ధాలతో భారీ విస్ఫోటం..సుమారు 22 మంది మృత్యువాత.. 17 మందికి తీవ్రగాయాలు.. ఒళ్లంతా కాలిన గాయాలతో.. ప్రాణాలు అరచేతపట్టుకుని అంతా పరుగులుదీశారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.  సుమారు మూడేళ్ల క్రితం జరిగిన ఈ దుర్ఘటన ఇంకా ‘నగరం’వాసుల కళ్లముందు పీడకలలా వెంటాడుతూనే ఉంది. మూడేళ్ల క్రితం వరకు నిత్యం వినియోగదారులతో కళకళలాడే భోజన హోటళ్లు, ఆ పరిసర ప్రాంతాలు నేటికీ కళావిహీనంగానే కనిపిస్తున్నాయి. పేలుడు అనంతరం పరామర్శలకు వచ్చిన నేతలు, అధికారులు ఎడాపెడా బాధితులకు హామీలిచ్చేశారు. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడమే మరిచారు.  
- నగరం (మామిడికుదురు): 
అమలుకు నోచుకోని హామీలు..
నగరం గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామంటూ చేసిన వాగ్దానాలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు 20 రోజులు రెండు విడతలుగా ఇంటింటా నిర్వహించిన సర్వే నివేదికలను బుట్టదాఖలు చేశారు. ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో పాటు గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. నగరంలో కమ్యూనికేషన్‌ స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా దానికీ మోక్షం లేదు. స్థానికంగా ఉన్న పీహెచ్‌సీని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఆస్పత్రి అభివృద్ధికి పైసా నిధులు కూడా కేటాయించలేదు.
మమ్మల్ని పట్టించుకోలేదు
నాటి పేలుడులో మా కుటుంబంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాకు ఒక్కొక్కరికీ రూ.ఐదు లక్షలు పరిహారం ఇచ్చారు. నాకు నాలుగు నెలల 15 రోజులు గెయిల్‌ ఆధ్వర్యంలోనే చికిత్స జరిగింది. తరువాత నన్ను పట్టించుకోలేదు. తదుపరి ఆరు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాను. దానికి గాను రూ.7.25 లక్షలు ఖర్చయ్యింది. వాళ్లు ఇచ్చిన ఐదు లక్షలు పోగా అదనంగా మరో రూ.2.25 లక్షలు ఖర్చయ్యింది. ఇళ్లు దెబ్బతిన్నందుకు గాను పరిహారం ఇస్తామన్నారు. అదీ ఇవ్వలేదు. ఇప్పటికీ గెయిల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం.
 - బోనం పెద్దిరాజు, బాధితుడు  
సహాయం కోసం.. 
పేలుడు సంఘటనలో నా కొడుకులు మోహన వెంకటకృష్ణ, మధుసూదన్, మావయ్య వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. చిన్న కొడుకు వెంకటకృష్ణ పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. రెండు చేతులు సరిగా పని చేయడం లేదు. చేతులకు ఆపరేషన్‌ చేయిస్తామన్నారు. దానిని పట్టించుకోవడం లేదు. ఆపరేషన్‌కు ఐదు లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంత ఆర్థిక స్థోమత మా కుటుంబానికి లేదు. గెయిల్‌ వారే ఆ ఖర్చు భరించాల్సి ఉంది. దీంతో పాటు పిల్లలకు చదువు చెప్పిస్తామన్నారు. దీనిపై నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేసినా ఫలితం లేదు. 
- వానరాశి దుర్గాదేవి, బాధితురాలు 
ఉద్యోగం ఇస్తామన్న హామీ నెరవేర్చలేదు
గెయిల్‌ పైప్‌లైన్‌ పేలుడులో నాన్న వానరాశి వెంకటరత్నం మృతి చెందారు. మా కుటుంబానికి ఆయనే ఆధారం. నేను డిగ్రీ చదువుకున్నా. మృతుల కుటుంబాల్లో అర్హులు ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పేలుడు జరిగి రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఆ హామీని నెరవేర్చలేదు. ఎన్నో సార్లు గెయిల్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. 
-  వానరాశి నాగసత్యస్వామి
ఇళ్లు కట్టిస్తామన్న హామీని విస్మరించారు
పేలుడు సంఘటనలో మా కుటుంబంలో ఆరుగురు చనిపోయారు. సొంత స్థలంఉంటే మృతుల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రభుత్వాధికారులకు, గెయిల్‌ అధికారులకు ఎన్ని పర్యాయాలు విజ్ఞాపన పత్రాలు అందించినా వారు పట్టించుకోలేదు. పేలుడు జరిగిన సమయంలో మాత్రం పదే పదే మా చుట్టూ తిరిగిన అధికారులు మళ్లీ కంటికి కనిపించనే లేదు. ఇళ్లు కట్టించి ఇస్తామన్న హామీని మాత్రం విస్మరించారు.
- అల్లూరి రామతులసి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement