♦ మొయినాబాద్‌లో సుడిగాలి పర్యటన
♦ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
మొయినాబాద్ : జిల్లాలో 4850 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి రూ.302 కోట్ల నిధులు ఖర్చుచేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. నాగిరెడ్డిగూడ, చందానగర్, చిలుకూరు పంచాయతీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
నాగిరెడ్డిగూడలో రూ.3 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు, చందానగర్‌లో రూ.3 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణ పనులు, చిలుకూరులో రూ.3 లక్షలతో సీసీ రోడ్డు, దేవల్‌వెంకటాపూర్‌లో రూ.5 లక్షలతో సులబ్‌కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, చిలుకూరులో రూ.6 లక్షల నిధులతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం ఫ్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా రూ.285 కోట్లతో 786 చెరువుల్లో పూడికతీత, మరమ్మతు పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి రూ.1100 కోట్లు, లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు రూ.115 కోట్లతో విద్యుత్ సబ్‌ష్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, వైస్ ఎంపీపీ పద్మమ్మ, సర్పంచ్‌లు సంధ్య, మల్లారెడ్డి, గున్నాల సంగీత, ఎంపీటీసీ సభ్యులు గణేష్, సహదేవ్, పెంటయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రాజేష్, తహసీల్దార్ అనంతరెడ్డి, ఈఓపీఆర్‌డీ సునంద, ఎంఈఓ వెంకటయ్య, ఏఈలు భాస్కర్‌రెడ్డి, శారద, బీజేపీ మండల అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌లు వర్ధన్, నర్సింహగౌడ్, నాయకులు కీసరి సంజీవరెడ్డి, జయవంత్ తదితరులు పాల్గొన్నారు.