వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి బలి
Published Sun, Aug 28 2016 10:56 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
శుభకార్యానికి వెళుతూ ఒకరు.. పొట్టకూటి కోసం సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లి మరొకరు.. ఇంటి పనుల్లో నిమగ్నమైన మహిళ ఇంకొకరు.. ఇలా వేర్వేరు ప్రాంతాల్లో మృత్యువు విలయతాండవం చేసి నలుగురు వ్యక్తులను కబలించింది.
మధురపూడి : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు నిర్మాణ లోపం వల్ల బుచ్చింపేట సమీపంలో ప్రత్తిపాడుకు చెందిన సత్యవతి(49)అనే మహిళ మోటార్ బైక్ నుంచి కిందపడి చనిపోయింది. ఆమె తన lభర్త, చంటిపిల్లాడితో కలిసి బైక్‌పై సీతానగరం మండలం ఉండేశ్వరపురంలోని బంధువుల ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి బయలుదేరింది. కోరుకొండ మండలం బుచ్చింపేట సమీపంలోని మలుపులో, ఎత్తుగా ఉన్న రోడ్డుపై బైక్ కుదుపులకు లోను కావడంతో ఆమె అదుపుతప్పి కిందపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మరణించింది. ఆమె మృతదేహాన్ని భర్త ఆటోలో స్వగ్రామానికి తరలించారు. దీనిపై తమకు సమాచారం అందలేదని కోరుకొండ పోలీసులు తెలిపారు.
చెట్టును ఢీకొన్న బైక్
వేళంగి (కరప) : మోటార్ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ఒకరు మరణించగా, మరొకరు గాయాలతో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన తాతాపూడి వీరబాబు(25), తాతపూడి వెంకన్నబాబు కలిసి కిరాణా సామాన్లు కొనుగోలు చేసేందుకు వేళంగి వచ్చారు. పని ముగిశాక బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా, వేళంగి–సిరిపురం మధ్య బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో గాయపడిన ఇద్దరినీ స్థానికులు రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరబాబు మరణించగా, వెంకన్నబాబు చికిత్స పొందుతున్నాడు. కరప ఏఎస్సై అడబాల గంగరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్.పెద్దపాలెం వద్ద మెకానిక్
అయినవిల్లి : అంబాజీపేట మండలం గంగలకుర్రుకు చెందిన కారు మెకానిక్ వాడ్రేవు రాంబాబు(33)ను ఆదివారం తెల్లవారుజామున ఎన్.పెద్దపాలెం వద్ద మోటార్ బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రాంబాబును ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో మరణించాడు. ఎస్సై డి.దుర్గా శేఖర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని మహిళ
ఏడిద (మండపేట) : మోటార్ బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ మహిళ మరణించినట్టు మండపేట రూరల్ పోలీసులు తెలిపారు. ఏడిద గ్రామానికి చెందిన బి.యశోదమ్మ (49) ఆదివారం మధ్యాహ్నం దుర్గమ్మ గుడి సెంటర్ వద్ద దుస్తులు ఉతుకుతుండగా, దుళ్ల వైపు నుంచి మోటార్ బైక్‌పై వచ్చిన ఆర్‌సీ వీరాస్వామి ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో యశోదమ్మ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement