'ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో 5 లక్షల ఉద్యోగాలు'
రేణిగుంట : ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రాష్ట్రంగా చేయడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కులో రూ.7.5 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో అనేక కంపెనీలు స్థాపిస్తారని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు ఐటీ రంగం ద్వారా పలు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు.
మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో సాంకేతిక విప్లవం వచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే భావితరాల వారి పరిస్థితి మృగ్యమవుతుందని తెలిపారు. రేణిగుంట, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు అనుగుణంగా ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఐటీ స్పెషల్ సెక్రటరీ కిషోర్, ఐటీ సీఈవో నిఖల్ అగర్వాల్, మహిళా యూనివర్శిటీ వీసీ వరలక్ష్మి, ఏపీఐఐసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.