500 ‘నో’ట్లు.. 1000 పాట్లు | 500 notes 1000 problems | Sakshi
Sakshi News home page

500 ‘నో’ట్లు.. 1000 పాట్లు

Published Wed, Nov 9 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

500 ‘నో’ట్లు.. 1000 పాట్లు

500 ‘నో’ట్లు.. 1000 పాట్లు

బిజినెస్‌.. ఖల్లాస్‌!
– 20 నుంచి 30 శాతానికి పడిపోయిన వ్యాపారాలు
– మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు బంద్‌.. రైతుల ఆందోళన
– హైవేపై ట్రాఫిక్‌ జామ్‌.. టోల్‌ ఎత్తేయడంతో సాఫీగా రవాణా
– రవాణా, వాణిజ్య పన్నులశాఖ చెక్‌పోస్టుల్లో నిలిచిపోయిన చెల్లింపులు
– రిజిస్ట్రేషన్‌శాఖలో భారీగా తగ్గిన లావాదేవీలు
– చిల్లర ఇవ్వలేక చేతులెత్తేసిన కండక్టర్లు
– వెలవెలబోయిన సినిమా థియేటర్లు.. దుకాణాలు
 
పాలు కొనుగోలు చేయాలన్నా చిల్లర దొరకదు. కూరగాయలకు వెళ్దామంటే అక్కడా ఇదే సమస్య. పెట్రోలు బంక్‌ల వద్దకు వెళితే.. రూ.500 మొత్తానికి అయితేనే అనే సమాధానం. సరుకులు కొందామంటే.. రూ.100 నోట్లు ఉంటేనే బేరం అంటున్నారు. బంగారు షాపులు.. బట్టల దుకాణాలు.. సినిమా థియేటర్లు అన్నీ వెలవెలబోగా.. పెద్ద నోట్ల రద్దు కలకలం జిల్లాను కుదిపేసింది.
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ఎక్కడ చూసినా పెద్ద నోట్ల చర్చే. తమ వద్దనున్న ఈ నోట్లను ఎలా మార్పిడి చేసుకోవాలోననే విషయంలోనే తర్జనభర్జనలు. అత్యవసరంగా చిల్లర కోసం కాళ్లు కాలిన పిల్లుల్లా జనం చక్కర్లు కొట్టడం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే సమస్య. దైనందిన జీవితంలో సామన్య, మధ్య తరగతి ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం. వినియోగదారులు లేక షాపులన్నీ బోసిపోయాయి. కరెంటు, టెలిఫోన్‌ బిల్లుల చెల్లింపులకూ ఆటంకాలు ఎదురయ్యాయి. మరోవైపు టోల్‌గేట్ల వద్ద చిల్లర లేక వాహనదారులు రహదారిపైనే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో హైవే మొత్తం ట్రాఫిక్‌జామ్‌తో స్తంభించిపోయింది. శుక్రవారం వరకూ టోల్‌ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్టు సాయంత్రం ప్రకటన రావడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సగటున రోజుకు 700 వరకూ లావాదేవీలు జరిగేవి. అయితే, నోట్ల రద్దుతో ఈ సంఖ్య కాస్తా 190కి పడిపోయాయి. థియేటర్లదీ అదే దుస్థితి. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో రోజుకు సగటున రూ.100 కోట్ల లావాదేవీలు జరగాల్సి ఉండగా.. ఈ సంఖ్య కాస్తా రూ.20 నుంచి రూ.30 కోట్లకు పరిమితమైపోయింది. అయితే, నోట్ల రద్దు పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ కొంచెం చిల్లర తీసుకునే ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
నోట్ల రద్దుతో వివిధ వర్గాల ప్రజల ఇక్కట్లు ఇవీ..
– మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తెచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే మద్దతు ధర లేక కష్టాల్లో ఉన్న ఉల్లి రైతులకు... కొనుగోళ్లు లేకపోవడం మరింత శరాఘాతంగా మారింది. హైవేలపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పాటు తమకు రూ.100 నోట్లలో చెల్లింపులు చేస్తేనే లారీలు తీస్తామని యాజమాన్యాలు పేర్కొనడంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి. 
– మందుబాబులకూ నోటు రద్దు తిప్పలు తప్పలేదు. రూ.500, రూ.1000 నోట్లకు మద్యం ఇచ్చేది లేదని మద్యం షాపు యాజమాన్యాలు స్పష్టం చేశాయి. మరికొన్ని షాపుల యజమానులు మాత్రం పెద్ద నోట్లను తీసుకుని మందును సరఫరా చేశారు.  
– థియేటర్‌లో జనాలు లేక బోసిపోయాయి. ఇక థియేటర్‌లోని షాపులదీ అదే పరిస్థితి. రోజుకు సగటున (షోకు రూ.30 వేల చొప్పున) లక్షా 20 వేల చొప్పున జరిగే బిజినెస్‌ కాస్తా షోకు రూ.10 వేల చొప్పున రూ.40 వేలకు పరిమితమయ్యిందని థియేటర్ల యాజమాన్యాలు వాపోతున్నారు. 
– పెట్రోలు బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే.. అంతే మొత్తానికైతేనే పెట్రోలు/డీజిల్‌ పోస్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో ఇచ్చిన పెద్ద నోటు మొత్తానికీ తప్పనిసరి పరిస్థితులల్లో పెట్రోలు/డీజిల్‌ను వాహనదారులు పోయించుకున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
– బంగారు షాపులు, షాపింగ్‌ మాల్స్‌ల్లో కూడా వ్యాపారం లేక వెలవెలబోయాయి. సెల్‌ఫోన్ల విక్రయాలు కూడా గణనీయంగా పడిపోయాయి.  
– ఆర్టీసీ బస్సుల్లో రూ.500, రూ.1000 నోట్లు తీసుకుంటున్నప్పటికీ అంత పెద్ద నోట్లకు చిల్లర ఇవ్వలేక ఆర్టీసీ, రైల్వే అధికారులు కూడా చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.
– రవాణా, వాణిజ్యపన్నులశాఖ చెక్‌పోస్టులల్లో కూడా పన్ను చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.500, రూ.1000 నోట్లను తీసుకోవ్దంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో చెల్లింపులన్నీ రూ.100, రూ.50 నోట్ల రూపంలో చేయాలని ఆయా శాఖల అధికారులు తేల్చి చెప్పారు. ఫలితంగా రవాణా శాఖ చెక్‌పోస్టు ఆదాయం కాస్తా రూ.2.5 లక్షల నుంచి రూ.60 వేలకు పడిపోయింది. 
 
అన్ని బ్యాంకులకూ చేరని డబ్బు
కొత్త నోట్లను బ్యాంకులకు పంపిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో కేవలం ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకులకు మాత్రమే కొత్త నోట్లు వచ్చాయి. అది కూడా కేవలం రూ.2 వేల నోట్లు మాత్రమే వచ్చాయని సమాచారం. దీంతో గురువారం బ్యాంకులు తెరచినప్పటికీ ఈ రెందు బ్యాంకుల వద్ద భారీగా రద్దీ ఉండనుంది. ఈ నేపథ్యంలో పోలీసుల ద్వారా బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక పోస్టాఫీసులకూ ప్రత్యేకంగా కొత్త నోట్లను సరఫరా చేయలేదు. వీరు కూడా బ్యాంకుల వద్దకు వెళ్లి తీసుకోవాల్సిందేనని తెలిసింది. 
 
సమయం ఇస్తే బాగుండేది...!
వాస్తవానికి నోట్ల రద్దు నిర్ణయం పట్ల సాధారణ ప్రజలతో పాటు మేధావులు, మధ్యతరగతి ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రోజువారీ అవసరాలకు చిల్లర తీసుకునే ఏర్పాట్లను చేసిన తర్వాత నోట్లను రద్దు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ నోట్లను రద్దు చేసినప్పటికీ పరిమిత మొత్తంలోనైనా చిల్లర ఇచ్చే ఏర్పాట్లను బ్యాంకుల ద్వారా కేంద్రం చేసి ఉంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేదనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా రోజువారీగా వినియోగించే పాలు, కూరగాయలు, పెట్రోలు, మందులు, ఇంట్లో వంటింటి సరుకుల వరకైనా చిల్లర మార్పిడికి అవకాశం కల్పించి ఉండాల్సిందని పేర్కొంటున్నారు. మరోవైపు త్వరలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వారి ఇబ్బందులు వర్ణనాతీతం. కనీసం బట్టలు, బంగారం కొనేందుకూ అవకాశం లేకపోవడంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోజువారీ నగదు విత్‌ డ్రాయిల్స్‌పై పరిమితి ఉండటంతో వారం రోజుల్లో కూడా బట్టలు, బంగారం కొనే వెసులుబాటు లేదని వాపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement