రీజియన్‌లో 510 బస్సులు నిలిపివేత
* రూ.80 లక్షలకుపైగా నష్టం
* హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సుల ఏర్పాటు
* పరిస్థితిని సమీక్షించిన ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి
పట్నంబజారు: భారీ వర్షాలకు ఆర్టీసీ రీజయన్ పరిధిలోని పలు సర్వీసులను రద్దు చేశారు. సుమారు 510పైగా బస్సులు రీజయన్ వ్యాప్తంగా ఆయా డిపోల్లో నిలిచిపోయాయి. మాచర్ల – పిడుగురాళ్ల, మాచర్ల– చిలకలూరిపేట, సత్తెనపల్లి– నర్సరావుపేట, సత్తెనపల్లి– మాదిపాడు, సత్తెనపల్లి– గుంటూరు, సత్తెనపల్లి– పిడుగురాళ్ల, చిలకలూరిపేట– నర్సరావుపేట, నర్సరావుపేట– గుంటూరు రూట్లలో పూర్తిస్థాయిలో సర్వీసులు రద్దయ్యాయి. గురజాల, రెడ్డిగూడెం, పిడుగురాళ్ల మొదలగు ప్రాంతాల్లో పరిస్థితిని ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పర్యవేక్షించి అప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెడ్డిగూడెం వద్ద ఆగిపోయిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను పిడుగురాళ్ల డిపో నుంచి ప్రత్యేకంగా 10 బస్సులు, బెల్లకొండ వద్ద నిలిచిన ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను 20 బస్సుల్లో తరలించారు. రెడ్డిగూడెం, మాచర్ల, బెల్లకొండల నుంచి హైదరాబాద్‌కు 40 బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆర్‌ఎం శ్రీహరి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అధికారులతో చర్చించి అదనంగా బస్సుల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామన్నారు. వరదల కారణంగా గురువారం ఒక్క రోజే రూ.80 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు.