సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ భూమికి రెక్కలొచ్చాయి.. వందల ఎకరాలు అక్రమార్కుల చెరలోకి వెళ్లినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. నకిలీ పట్టాల జారీతో సర్కారు భూమికి ఎసరు పెట్టినట్టు గుర్తించింది. మంచాల మండలం లోయపల్లిలో చోటుచేసుకున్న బోగస్ పట్టాల జారీలో 513ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అడ్డగోలుగా పుట్టుకొచ్చిన పట్టాల వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం విచారణను ముమ్మరం చేసింది. లోయపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 334, 335, 370లలో 694 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో భూమిలేని పేదలకు 1991లో 175 ఎకరాల మేర అసైన్‌మెంట్(లావణి) పట్టా సర్టిఫికెట్లు జారీచేసినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
సర్వే నం.334లో 11మంది లబ్ధిదారులకు 33 ఎకరాలు, సర్వే నం. 335లో ఐదుగురికి 15ఎకరాలు, సర్వే నం.370లో 62మందికి 127ఎకరాలను కేటాయించారు. అయితే, ఆ తర్వాత కాలంలో అడ్డగోలుగా పట్టాలు పుట్టుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇవన్నీ దాదాపుగా నకిలీవేనని ప్రాథమిక అంచనాకొచ్చిన జిల్లా యంత్రాంగం.. ఈ పట్టాలను నిశితంగా పరిశీలించేందుకు పట్టాదార్లకు నోటీసులు జారీచేయాలని నిర్ణయించింది.
గుట్టుగా మొత్తం భూమికి ఎసరు..
పదేళ్ల వ్యవధిలో ఈ సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూములన్నింటికీ రెక్కలొచ్చాయి. 2011-12 పహాణీ రికార్డుల మేరకు సర్వే నం. 334లో 238.30 ఎకరాలను 84మందికి, సర్వే నం.335లో 219 ఎకరాలను 65మందికి, సర్వే నం.370లో 231ఎకరాలను 96మందికి పట్టాలు జారీ చేసినట్టు రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. మొత్తం విస్తీర్ణంలో ఆరు ఎకరాలు మినహా మిగతా భూమికి ఎసరు పెట్టినట్టు తేల్చింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే పట్టాలు సృష్టించినట్లు గుర్తించిన యంత్రాంగం.. పహాణీలో పేర్లు నమోదు కావడాన్ని సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో బోగస్ పట్టాలు పుట్టుకొచ్చాయా? లేక వారే ఈ అక్రమాలకు తెరలేపారా? అనే కోణంలో కూపీ లాగుతోంది.
స్థానిక తహసీల్దార్ ఇప్పటికే ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించింది. కాగా, నకిలీ పట్టాలిచ్చిన భూమి చాలావరకు కొండ లు, గుట్టలతో నిండిపోవడంతో వ్యవసాయానికి అనువుగా లేదు. దీంతో ఈ పట్టాలను ఉపయోగించుకొని బ్యాంకుల్లో రుణాలను విరివిగా తీసుకున్నట్లు బయటపడింది. ఈ క్రమంలో సంబంధిత సర్వే నంబర్లలోని పట్టాలను పూచీకత్తుగా పెట్టుకొని మంజూరు చేసిన రుణ వివరాలను అందజేయాలని జిల్లా యంత్రాంగం ఆయా బ్యాంకులకు లేఖలు రాసింది.