అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రధానోపాధ్యాయులను మండల విద్యాశాఖ అధికారులు(ఎంఈఓలు)గా నియమించేందుకు ఆదివారం కడప నగరంలో నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జోన్ పరిధిలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి సీనియార్టీ ఆధారంగా అర్హులైన వారిని ఎంఈఓలుగా నియమించారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన ఈ కౌన్సెలింగ్ జరిగింది. జిల్లా విద్యాశాఖ తరఫున సూపరింటెండెంట్ సురేష్, పార్థసారథి, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 63 మండలలకు గాను 11 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. తక్కిన 52 మండలాలకు ఇన్నిరోజులూ ఇన్‌చార్జ్‌లుగా హెచ్‌ఎంలు ఉన్నారు. వీరిలో 27 మందికి తిరిగి అవకాశం రాగా.. తక్కిన 25 మంది పాఠశాలలకు పరిమితం అయ్యారు. ఇదిలాఉండగా జోన్ పరిధిలో అనంతపురం జిల్లాలోనే ఎక్కువ పోటీ నెలకొంది.