ముఖ్యమంత్రిగా ఓసీ, టీపీసీసీ అధ్యక్షునిగా బీసీ నేతను నియమించే సంప్రదాయం కొనసాగింపు
విధేయతకు ప్రాధాన్యం..రేవంత్ సిఫారసుకు గ్రీన్‌సిగ్నల్
మధుయాష్కీ, మహేశ్‌ల మధ్య చివరి వరకూ దోబూచులాట
ఎస్సీ నేతను నియమించాలని అనుకున్నా మారిన అధిష్టానం ఆలోచన
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష నియామకంలో కాంగ్రెస్ హైకమాండ్ పాత ఫార్ములానే అనుసరించింది. ముఖ్యమంత్రిగా ఓసీ వర్గాలకు చెందిన వారిని నియమిస్తే... బీసీ వర్గానికి టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే సాంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోపాటు ఆయన మూడేళ్ల పదవీకాలం కూడా ముగిసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారాన్ని ఏఐసీసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. నాలుగు నెలలుగా దీనిపై కసరత్తు చేసిన అధిష్టానం పలుమార్లు రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపి, అనేక కోణాల్లో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల పేర్లను ఈ పదవి కోసం పరిశీలించి చివరకు మహేశ్‌గౌడ్ వైపు మొగ్గు చూపింది.
చర్చోపచర్చలు.. భిన్న వాదనలు
కర్ణాటక ఫార్ములా ప్రకారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని తొలుత ప్రచారం జరిగింది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా అధ్యక్షుడిగా నియమించే అవకాశముందనే చర్చ కూడా జరిగింది. ఆ చర్చల అనంతరం సామాజికవర్గాల లెక్కలు తెరపైకి వచ్చాయి. ఓసీ వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రిగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తారని, ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పోరిక బలరాంనాయక్, మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్‌లలో ఒకరిని ఈ పదవిలో నియమిస్తారనే ప్రచారం ఊపందుకుంది.
దీంతో పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్మున్షీలను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించినప్పటికీ అధ్యక్షుడి వ్యవహారాన్ని తేల్చలేదు. కేబినెట్ ఖాళీలు భర్తీ చేసే క్రమంలో సామాజిక సమతుల్యత సరిపోలడం లేదంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఇక, ఎస్సీల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాదిగ సామాజికవర్గానికి అవకాశం వస్తుందని, ఈ మేరకు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేరు ఖరారైందని ప్రచారం జరిగింది.
ఆ తర్వాత కొన్నాళ్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పేరు వినిపించింది. సీనియర్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఈ పదవిలో నియమిస్తారని మరికొన్నాళ్లు చర్చ జరిగింది. ఇక, ఎట్టకేలకు ఆగస్టు చివరి వారంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో జరిపిన చర్చల్లో బీసీ వర్గానికి అధ్యక్ష పదవిని ప్రతిపాదించిన ఏఐసీసీ మధుయాష్కీ, మహేశ్‌గౌడ్‌ల పేర్లపై కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఎట్టకేలకు మహేశ్‌గౌడ్ వైపు మొగ్గుచూపింది.
రెండు ప్రాంతాలకు చెరో పదవి
మహేశ్‌గౌడ్‌ను అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో విధేయతకు ఏఐసీసీ పెద్దపీట వేసింది. దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం, సామాజిక సమతుల్యత, రేవంత్ సిఫారసుకు ప్రాధాన్యం, సంస్థాగత వ్యవహారాలపై పట్టు నేపథ్యంలో మధుయాష్కీ, మహేశ్‌గౌడ్‌ల మధ్య దోబూచులాటతో చివరి నిమిషంలో ఉత్కంఠ రేపింది. మహేశ్‌గౌడ్ నియామకం పూర్తయిందని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే సంతకం చేశారని, కేసీ.వేణుగోపాల్ కూడా మహేశ్‌గౌడ్‌తో మాట్లాడి దిశానిర్దేశం చేశారనే వార్తలొచ్చిన తర్వాత కూడా మరోవారం రోజుల పాటు జాప్యం జరిగింది. ఈనేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ మార్కు ఊహాగానాలకు తెరలేచినా ఎట్టకేలకు మహేశ్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment