ఆదర్శ ప్రాథమిక పాఠశాలు 541
Published Tue, Aug 2 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
జిల్లాలో ప్రస్తుతం ఏదైనా ప్రాథమిక పాఠశాలకు వెళితే ఒకరో, ఇద్దరో టీచర్లు కనిపిస్తారు. పొరపాటున ఇద్దరు టీచర్లకు అర్జెంటుగా పనిపడితే ఆ రోజు పాఠశాలకు అనధికారికంగా సెలవు ప్రకటించే దుస్థితి. ఈ పరిస్థితిని మార్చేందుకు వీలుగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు మొదలయింది. రెండు, మూడు నెలల్లో జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 541 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో కనిష్టంగా 5గురు టీచర్లు ఉండనున్నారు. అంతేకాకుండా ఒక్కో టీచర్ ఒక్కో సబ్జెక్టును బోధించేందుకు ప్రత్యేకంగా నియమితులుకానున్నారు. జిల్లాలో 100 మంది విద్యార్థుల కంటే అధికంగా చదువుతున్న 541 ప్రాథమిక పాఠశాలలను గుర్తించి.. వీటిని ఆదర్శ పాఠశాలలుగా మార్చనున్నారు. ఇందుకోసం అదనంగా 800 మంది టీచర్లు అవసరమవుతారని ప్రభుత్వానికి జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) రవీంధ్రనాథ్ రెడ్డి నివేదిక సమర్పించారు. అంతేకాకుండా ఈ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలకు కూడా నిధులు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డీఈఓల సమావేశంలో ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చిన వెంటనే రెండు, మూడు నెలల్లో జిల్లాలో 541 ప్రాథమిక పాఠశాలలు కాస్తా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మారనున్నాయి. వీటిలో 82వేల మంది విద్యార్థులు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు.
ల్యాబ్‌తో పాటు...
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రై వేటు పాఠశాలలకు పంపించలేని ఆర్థిక పరిస్థితే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒక్కో పాఠశాలలో ఏకంగా 500 మంది వరకూ విద్యార్థులు ఉంటున్నారు. అయితే, వీరికి సరిపడిన సంఖ్యలో ఉపాధ్యాయులు కానీ.. మౌలిక సదుపాయాలు కానీ లేవు. ఈ నేపథ్యంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఈ పాఠశాలల్లో సగటున కచ్చితంగా 5గురు టీచర్లు ఉండనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు కానుంది. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా నిధులు కావాలని కోరారు. అదేవిధంగా ఇంగ్లిష్‌లో బోధించేందుకు ప్రత్యేకంగా ఒక అధ్యాపకుడిని కూడా నియమించనున్నారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేసిన వాటిలో సగటున 3.5 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా సగటున ఒక్కో పాఠశాలలో 157 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సగటు ఉపాధ్యాయుల సంఖ్యను ఐదుకు పెంచేందుకు వీలుగా అదనంగా 800 మంది టీచర్లు కావాల్సి ఉంటుంది. ఈ పోస్టులను వాలంటీర్లతో కానీ అదనంగా ఇతర చోట్ల పనిచేస్తున్న ఉపాధ్యాయులను కానీ బదిలీ చేయనున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement