-
పేద కుటుంబాన్ని వెంటాడిన విధి
-
విషజ్వరంతో కూలీ మృతి, చందాలతో దహన సంస్కారాలు
-
పెళ్లైన 7 నెలలకే మృత్యు ఒడిలోకి
-
రామచంద్రాపూర్‌లో విషాదం
సిరిసిల్ల రూరల్: రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ ఐదేళ్లూ నోట్లోకి పోని కూలీ బతుకులు వారివి. నిత్యం పనికిపోయి ఏపూటకు ఆ పూటే బతుకులీడ్చేవారికి రోగమొస్తే ఎక్కడికని పోతారు? తడిసి మోపెడయ్యే బిల్లులకు భయపడి ఖరీదైన వైద్యం జోలికి వెళ్లకుండా.. ప్రాణాలమీదికొస్తున్నా నిస్సహాయంగా నిట్టూర్చాల్సిన దుస్థితి వారిది. విధి వంచించిన ఆ కుటుంబంలో ఆరేళ్లలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆ కుటుంబ వ్యథ తెలిస్తే అయ్యో పాపం అనని వారుండరు.
సిరిసిల్ల మండలం రామచంద్రాపూర్‌లో జరిగిన సంఘటన మనసున్న ప్రతిమనిషినీ కదిలిస్తుంది. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మేడిపల్లి ప్రభాకర్(30) అనే కూలీ పెళ్లైన ఏడు నెలలకే విషజ్వరం సోకి మరణించాడు. వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ శుక్రవారం ఆస్పత్రిలో మృతి చెందాడు. ప్రభాకర్‌కు జనవరిలో లావణ్యతో పెళ్లైంది. లావణ్య ప్రస్తుతం గర్భవతి. జీవితంపై ఆమె కన్న కలలన్నీ కల్లలయ్యాయి. ఉన్నట్లుండి ప్రభాకర్‌కు జ్వరం సోకడంతో తగ్గుతుందని భావించి స్థానికంగానే వైద్యం చేయించుకున్నారు. ఎంతకూ తగ్గకపోవడంతో సిరిసిల్లలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా షుగర్ కూడా∙ఉన్నట్లు తేలింది. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. వైద్యానికి డబ్బులు లేక సిరిసిల్లలో వైద్య చికిత్సలు చేయించుకుంటుండగా.. ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మరణించాడు. దీంతో రామచంద్రాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆరేళ్లలో ఐదు చావులు
రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి నర్సయ్య–లీలావతి కుటుంబాన్ని విధి కాటేసింది. ఆరేళ్ల క్రితం నర్సయ్య అనారోగ్యంతో మరణించాడు. నర్సయ్య మరణించిన ఆరు నెలలకే పెద్ద కొడుకు సుదర్శన్ అనారోగ్యంతో మరణించాడు. ఇదే ఇంట్లో ఉంటున్న నర్సయ్య మనవడు, రెండేళ్ల చిన్నారి రోహి నాలుగేళ్ల క్రితం నీటి గుంతలో పడి మరణించాడు. కొన్నాళ్లకు పెద్ద మనవడు రమేశ్ (16) పసరికలు సోకి మరణించాడు. శుక్రవారం ప్రభాకర్ మరణంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది. ఈ సంఘటనలను తలచుకుని గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఒంటరిగా మిగిలిన తల్లి లీలావతి ఇంట్లో మగదిక్కు లేకుండా పోయిందని బోరున విలపించారు. తామేం పాపం చేశామంటూ రోధించడం అందరినీ కలచివేసింది.