viral feavour
-
పల్లెల్లో పంజా విసురుతున్న జ్వరం
బెగలూరులో రక్తకణాలు తగ్గి ముగ్గురి పరిస్థితి విషమం కాళేశ్వరం: మారుమూలు పల్లెల్లో జ్వరాలు పంజా విసురుతున్నాయి. మహదేవపూర్ మండలం బెగలూరులో అస్వస్థతతో ఇంటికొకరు మంచంపడుతున్న తీరు స్థానికుల్లో కలవరం రేపుతోంది. గ్రామానికి చెందిన కారు లక్ష్మి, కారు శ్రీనివాస్, కారు సమ్మయ్య అనే వ్యక్తులకు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున క్లస్టర్ ఎస్పీహెచ్వో సమియోద్దీన్ మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆ గ్రామంలో ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు సుబ్బరాజు, విజయలక్ష్మి అనే దంపతులు డెంగీ లక్షణాలతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. -
విషజ్వరాలను పట్టించుకోని సర్కార్
ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్యసేవలందించాలి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కాళేశ్వరం: మంథని డివిజన్లో విషజ్వరాలతో ప్రజలు మృతి చెందుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైందని టీపీసీసీ ఉపాద్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాళేశ్వరంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విషజ్వరాలబారిన పడిన నిరుపేదలకు ఆరోగ్యశ్రీకార్డు కింద వైద్యసేవలందించాలన్నారు. బెగులూర్ గ్రామంలో విషజ్వరాలతో ఐదుగురు మృతి చెందినా ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి చలనం లేదన్నారు. మహదేవపూర్ మండలంలో విషజ్వరాలతో 12మంది వరకు మృతిచెందినట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా మంత్రులు, కలెక్టర్ పట్టించుకోకపోవడం బాధాకర మన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను నియమించి ప్రాథమిక చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. విషజ్వరాలు ప్రబలుతున్న గ్రామాల్లో ప్రభుత్వం వైద్య బృందాలను ఏర్పాటుచేసి వ్యాధులు నయమయ్యేవరకు పర్యవేక్షించాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. సమావేశంలో మహదేవపూర్ సర్పంచ్ కోటరాజబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజీ తిరుపతి, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు విలాస్‌రావు, కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు తిరుపతిరెడ్డి,సమ్మయ్య పాల్గొన్నారు. -
‘తూర్పు’న జ్వరాల పంజా
మంచంపట్టిన మహదేవపూర్ బెగులూర్ వారంలో ముగ్గురు జ్వరంతో మృతి ఆదివారం పంకెనలో ఇద్దరు నెలరోజుల్లో ఎనిమిది మంది ప్రాణాలు హరి పట్టించుకోని వైద్యాధికారులు కాళేశ్వరం : తూర్పు పల్లెలు విషజ్వరాల కోరల్లో చిక్కాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా వ్యాధులు ప్రబలాయి. దీంతో పలు గ్రామాల్లో జ్వరం, విరోచనాలు, రక్తకణాలు తగ్గి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కేవలం ఒక మహదేవపూర్ మండలంలో 20 రోజుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. అయినా ప్రభుత్వవైద్య సిబ్బంది మొద్దు నిద్ర వీడడం లేదు. 20 రోజుల్లో... ఎనిమిది మంది మృతి –మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో ఇద్దరు అయిలి సమ్మయ్య, గుజ్జుల సమ్మయ్య విషజ్వరంతో మృతి చెందారు. – బెగులూర్‌కు చెందిన కూలీ తుంగ సమ్మయ్య(45) వారంరోజులుగా విషజ్వరం బారిన పడి ప్రాణాలు వదిలాడు. – బెగులూర్ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తెరుక రేణుక(19)రక్త కణాలు తగ్గి ఆసుపత్రిలో మృతి చెందింది. రేణుక వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వరంగల్ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరింది. రక్తకణాలు తగ్గి మృతి చెందింది. – బెగులూర్ గ్రామానికి చెందిన కారు రాజన్న(28) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ రక్తకణాలు తగ్గి వరంగల్‌కు తరలిస్తుండగా మరణించాడు. –మద్దులపల్లి గ్రామానికి చెందిన సకినారపు నారాయణ(50)వాంతులు, విరోచనాలు, జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. –సూరారం గ్రామానికి చెందిన పెద్ది స్వామి(35) విషజ్వరంతో మృతి చెందాడు. –పంకెనకు చెందిన పత్రి చందమ్మ(60), టి.సమ్మయ్య(50) వారం రోజులుగా జ్వరాలతో ఆదివారం మరణించారు. విజృంభిస్తున్న విషజ్వరాలు మహదేవపూర్ మండలంలోని బెగులూర్, పంకెన, మద్దులపల్లి తదితర గ్రామాల్లో జ్వరాలతో పదుల సంఖ్యలో గ్రామస్తులు మంచం పట్టారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. రోడ్లన్నీ చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారుతున్నాయి. దీంతో దోమలు, క్రిమికీటకాలు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా,డయేరియా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. కనీసం పంచాయతీ అధికారులు బ్లీచింగ్ చల్లడం లేదని విమర్శలున్నాయి. ప్రైవేటు వైద్యానికి పరుగులు అంబట్పల్లి పీహెచ్సీలో ఇన్చార్జి వైద్యులు స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి మందులు పంపిణీ చేయడంలేదు. మూడు మండలాలకు పెద్దదిక్కైన మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉంటే .. వారు షిఫ్టులుగా విడిపోయి వారానికి ఒకరు వస్తున్నారు. దీంతో రోగులు ప్రవేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు స్పందించి జ్వరాలతో బాధపడుతున్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. బెగులూర్ వైద్యశిబిరం మండలంలో నెల రోజులు వ్యవధిలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దీంతో బెగులూర్‌లో ఏకంగా ముగ్గురు మృతి చెందడంతో జిల్లా వైద్యాధికారి రాజేశం గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటుచేశారు. రోగులను పరీక్షించి రక్తనమూనాలు తీసుకుని మందులు పంపిణీ చేశారు. -
జ్వరంతో ఒకరు మృతి
ఎలిగేడు: మండలంలోని ధూళికట్టకు చెందిన కొండ రాజయ్య(38) జ్వరంతో బుధవారం మృతిచెందాడు. రాజయ్యకు 5రోజుల కిందట జ్వరంరాగా ఆస్పత్రికిలో వైద్యపరీక్షలు చేయించుకుని మందులు వాడుతున్నాడు. బుధవారం పొలం దున్నుతుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్సకోసం 108 వాహనంలో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గ్రామంలో మరికొంత మంది జ్వరాలతో బాధపడుతున్నారని అధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
విషజ్వరంతో విద్యార్థిని మృతి
చొప్పదండి: మండలంలోని కాట్నపల్లికి చెందిన సిరిపురం సంధ్య (12) అనే విద్యార్థిని విషజ్వరంతో బుధవారం మృతి చెందింది. రుక్మాపూర్‌లోని ఆదర్శ పాఠశాలలో సంధ్య తొమ్మిదవ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం జ్వరానికి గురి కాగా కుటుంబసభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంధ్య మృతి చెందింది. విద్యార్థిని కుటుంబాన్ని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ వరప్రసాదాచారి పరామర్శించారు. -
ఆరేళ్లలో.. ఐదు
పేద కుటుంబాన్ని వెంటాడిన విధి విషజ్వరంతో కూలీ మృతి, చందాలతో దహన సంస్కారాలు పెళ్లైన 7 నెలలకే మృత్యు ఒడిలోకి రామచంద్రాపూర్‌లో విషాదం సిరిసిల్ల రూరల్: రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ ఐదేళ్లూ నోట్లోకి పోని కూలీ బతుకులు వారివి. నిత్యం పనికిపోయి ఏపూటకు ఆ పూటే బతుకులీడ్చేవారికి రోగమొస్తే ఎక్కడికని పోతారు? తడిసి మోపెడయ్యే బిల్లులకు భయపడి ఖరీదైన వైద్యం జోలికి వెళ్లకుండా.. ప్రాణాలమీదికొస్తున్నా నిస్సహాయంగా నిట్టూర్చాల్సిన దుస్థితి వారిది. విధి వంచించిన ఆ కుటుంబంలో ఆరేళ్లలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఆ కుటుంబ వ్యథ తెలిస్తే అయ్యో పాపం అనని వారుండరు. సిరిసిల్ల మండలం రామచంద్రాపూర్‌లో జరిగిన సంఘటన మనసున్న ప్రతిమనిషినీ కదిలిస్తుంది. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మేడిపల్లి ప్రభాకర్(30) అనే కూలీ పెళ్లైన ఏడు నెలలకే విషజ్వరం సోకి మరణించాడు. వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ శుక్రవారం ఆస్పత్రిలో మృతి చెందాడు. ప్రభాకర్‌కు జనవరిలో లావణ్యతో పెళ్లైంది. లావణ్య ప్రస్తుతం గర్భవతి. జీవితంపై ఆమె కన్న కలలన్నీ కల్లలయ్యాయి. ఉన్నట్లుండి ప్రభాకర్‌కు జ్వరం సోకడంతో తగ్గుతుందని భావించి స్థానికంగానే వైద్యం చేయించుకున్నారు. ఎంతకూ తగ్గకపోవడంతో సిరిసిల్లలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా షుగర్ కూడా∙ఉన్నట్లు తేలింది. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. వైద్యానికి డబ్బులు లేక సిరిసిల్లలో వైద్య చికిత్సలు చేయించుకుంటుండగా.. ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మరణించాడు. దీంతో రామచంద్రాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆరేళ్లలో ఐదు చావులు రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి నర్సయ్య–లీలావతి కుటుంబాన్ని విధి కాటేసింది. ఆరేళ్ల క్రితం నర్సయ్య అనారోగ్యంతో మరణించాడు. నర్సయ్య మరణించిన ఆరు నెలలకే పెద్ద కొడుకు సుదర్శన్ అనారోగ్యంతో మరణించాడు. ఇదే ఇంట్లో ఉంటున్న నర్సయ్య మనవడు, రెండేళ్ల చిన్నారి రోహి నాలుగేళ్ల క్రితం నీటి గుంతలో పడి మరణించాడు. కొన్నాళ్లకు పెద్ద మనవడు రమేశ్ (16) పసరికలు సోకి మరణించాడు. శుక్రవారం ప్రభాకర్ మరణంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది. ఈ సంఘటనలను తలచుకుని గ్రామస్తులు కంటతడిపెట్టారు. ఒంటరిగా మిగిలిన తల్లి లీలావతి ఇంట్లో మగదిక్కు లేకుండా పోయిందని బోరున విలపించారు. తామేం పాపం చేశామంటూ రోధించడం అందరినీ కలచివేసింది.