‘తూర్పు’న జ్వరాల పంజా | viral feavour in mahadevpoor | Sakshi
Sakshi News home page

‘తూర్పు’న జ్వరాల పంజా

Published Sun, Aug 7 2016 9:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

‘తూర్పు’న జ్వరాల పంజా

‘తూర్పు’న జ్వరాల పంజా

  • మంచంపట్టిన మహదేవపూర్‌
  • బెగులూర్‌ వారంలో ముగ్గురు జ్వరంతో మృతి
  • ఆదివారం పంకెనలో ఇద్దరు
  • నెలరోజుల్లో ఎనిమిది మంది ప్రాణాలు హరి
  • పట్టించుకోని వైద్యాధికారులు
  • కాళేశ్వరం : తూర్పు పల్లెలు విషజ్వరాల కోరల్లో చిక్కాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా వ్యాధులు ప్రబలాయి. దీంతో పలు గ్రామాల్లో జ్వరం, విరోచనాలు, రక్తకణాలు తగ్గి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కేవలం ఒక మహదేవపూర్‌ మండలంలో 20 రోజుల్లో  ఎనిమిది మంది మృతిచెందారు. అయినా ప్రభుత్వవైద్య సిబ్బంది మొద్దు నిద్ర వీడడం లేదు. 
     
    20 రోజుల్లో... ఎనిమిది మంది మృతి
    –మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలో ఇద్దరు అయిలి సమ్మయ్య, గుజ్జుల సమ్మయ్య విషజ్వరంతో మృతి చెందారు. 
    – బెగులూర్‌కు చెందిన కూలీ తుంగ సమ్మయ్య(45) వారంరోజులుగా విషజ్వరం బారిన పడి ప్రాణాలు వదిలాడు. 
    – బెగులూర్‌ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తెరుక రేణుక(19)రక్త కణాలు తగ్గి ఆసుపత్రిలో మృతి చెందింది. రేణుక వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వరంగల్‌ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేరింది. రక్తకణాలు తగ్గి మృతి చెందింది.
    – బెగులూర్‌ గ్రామానికి చెందిన కారు రాజన్న(28) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ రక్తకణాలు తగ్గి వరంగల్‌కు తరలిస్తుండగా మరణించాడు.
    –మద్దులపల్లి గ్రామానికి చెందిన సకినారపు నారాయణ(50)వాంతులు, విరోచనాలు, జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు.
    –సూరారం గ్రామానికి చెందిన పెద్ది స్వామి(35) విషజ్వరంతో మృతి చెందాడు.
    –పంకెనకు చెందిన పత్రి చందమ్మ(60), టి.సమ్మయ్య(50) వారం రోజులుగా జ్వరాలతో ఆదివారం మరణించారు. 
     
     విజృంభిస్తున్న విషజ్వరాలు
    మహదేవపూర్‌ మండలంలోని బెగులూర్, పంకెన, మద్దులపల్లి తదితర గ్రామాల్లో జ్వరాలతో పదుల సంఖ్యలో గ్రామస్తులు మంచం పట్టారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. రోడ్లన్నీ చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారుతున్నాయి. దీంతో దోమలు, క్రిమికీటకాలు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా,డయేరియా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. కనీసం పంచాయతీ అధికారులు బ్లీచింగ్‌ చల్లడం లేదని విమర్శలున్నాయి. 
     
    ప్రైవేటు వైద్యానికి పరుగులు
    అంబట్‌పల్లి పీహెచ్‌సీలో ఇన్‌చార్జి వైద్యులు స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి మందులు పంపిణీ చేయడంలేదు. మూడు మండలాలకు పెద్దదిక్కైన మహదేవపూర్‌ సామాజిక ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉంటే .. వారు షిఫ్టులుగా విడిపోయి వారానికి ఒకరు వస్తున్నారు. దీంతో రోగులు ప్రవేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు స్పందించి జ్వరాలతో బాధపడుతున్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
     
    బెగులూర్‌ వైద్యశిబిరం
    మండలంలో నెల రోజులు వ్యవధిలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దీంతో బెగులూర్‌లో ఏకంగా ముగ్గురు మృతి చెందడంతో జిల్లా వైద్యాధికారి రాజేశం గ్రామంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటుచేశారు. రోగులను పరీక్షించి రక్తనమూనాలు తీసుకుని మందులు పంపిణీ చేశారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement