మూడు మండలాలకు పెద్దదిక్కు
-
వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
-
సీజనల్‌వ్యాధులతో ఆసుపత్రి కిటకిట
-
పరికరాలు ఉన్న ఆచరణ శూన్యం
-
పట్టించుకోని జిల్లా అధికారులు
కాళేశ్వరం: మహదేవపూర్, కాటారం, మహాముత్తారం మండలాలకు పెద్ద దిక్కైన మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి జ్వరమొచ్చింది. వైద్యులు, సిబ్బంది కొరతతో సుస్తీ చేసింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామానికి పదుల సంఖ్యలో మంచానికే పరిమితమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రికని వస్తే సరైన వైద్యం అందడంలేదని రోగులు అంటున్నారు. ఆస్పత్రిలో పారిశుధ్యం పడకేసింది.
జ్వరాలతో ఆసుపత్రి కిటకిట
వాతావరణంలో మార్పులతో మూడు మండలాల్లో ప్రజలు జ్వరం, విరోచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరుతున్నారు. దీంతో బెడ్లన్నీ నిండిపోయాయి. మహదేవపూర్‌లోని కుదురుపల్లి, కాళేశ్వరం, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్, కుదరుపల్లి, మద్దులపల్లి, బెగులూర్, సూరారం నుంచి వచ్చి ఆస్పత్రిలో చేరుతున్నారు. పెద్దంపేట, లెంకలగడ్డ, సూరారం, అంబట్‌పల్లి, పలిమెల, పంకెన, సర్వాయిపేట గ్రామాల్లో జ్వరపీడితులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే బెగులూర్, పంకెన, మద్దులపల్లి, కిష్టరావుపేట, అంబట్‌పల్లి, సూరారంలో 19మంది విషజ్వరాలతో మత్యువాతపడ్డారు.
ప్రసవాలు వస్తే రెఫర్..
ఈ ఆస్పత్రిలో ప్రభుత్వం ఆశించినంత ప్రసవాలు జరగడం లేదు. గర్భిణులు ప్రసవాల కోసం ఇక్కడికి వస్తే వైద్యులు, సిబ్బంది తమతో కాదంటూ వరంగల్, గోదావరిఖనికి రెఫర్ చేస్తున్నారు. గత నెలలో పెద్దంపేటకు చెందిన ఓ గర్భిణి నొప్పులతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడి వైద్యులు వరంగల్‌కు పంపించారు. ఆమె మార్గంమధ్యలోని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించింది. దీనిపై జిల్లా అధికారి ఇక్కడి వైద్యసిబ్బందిని మందలించినట్లు తెలిసింది.
ఎన్‌బీసీయూ నిరుపయోగం
ఈ ఆస్పత్రిలో నవజాత శిశువు సంరక్షణ యూనిట్(ఎన్‌బీసీయూ)లో అన్నీ రకాల వసతులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గైనకాలజిస్టు, మత్తు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు కొరతతో అది నిరుపయోగంగా మారింది. ఏసీ గదులు, స్పెషల్‌వార్డులు, పిల్లలకు వెంటిలేటర్ పరికరాలు కొన్నేళ్లుగా వినియోగంలేవు. డాక్టర్లు లేక బాలింతలు, గర్భిణులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు.
జనరేటర్ ఉన్నా లేనట్లే..!
జనరేటర్ అందుబాటులో ఉండి కూడా లేనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మూడు మండలాల నుంచి కుటుంబనియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చి రోజు మొత్తం అవస్థలు పడుతున్నారు. కరెంట్ సరఫరా లేని రోజుల్లో జనరేటర్ లేక అర్ధరాత్రి వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. ఆ జనరేటర్‌పై ఎంతో ఖర్చును ప్రభుత్వానికి చూపిస్తూ వేలాది రూపాయలు స్వాహా చేస్తున్నట్లు సమాచారం.
నీటి సమస్య, శానిటేషన్
ఆస్పత్రి ఉన్న ఒక్క మోటర్‌తో నీరు సరిపోక రోగులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో ఎక్కడ చూసినా పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరుగుదొడ్ల వద్ద దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు సంచరిస్తున్నాయి.
శానిటేషన్ సిబ్బంది కొరత
ఆస్పత్రి శానిటేషన్ సిబ్బంది కొరత ఉంది. కాంట్రాక్టు సిబ్బందితోనే నడిపిస్తున్నారు. ఎంఎన్‌వో పోస్టులు నాలుగు కాగా.. ఇద్దరు ఉన్నారు. ఎఫ్‌ఎంవో 1, స్వీపర్ 1, తోటమాలి 1 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్ ఏఎన్‌ఎంలు రాత్రిపూట డ్యూటీలో ఉన్న కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు వచ్చే అలవెన్సులు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గర్భిణులకు రక్త పరీక్ష కిట్లు లేవు
గర్భిణులకు రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించే కిట్లు అందుబాటులో లేవు. బ్లడ్ పర్సెంటేజీ, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏసీ, టైఫాయిడ్, మలేరియా కిట్లు లేక ఇబ్బందులకు గురువుతున్నారు. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించడంలేదు.
ప్లేట్‌లేట్ మిషన్‌కు లెక్క లేదు
ఆస్పత్రిలో ప్లేట్‌లేట్ మిషన్‌కు సంబంధించిన కెమికల్స్ నెలకు 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. రూ.4వేలతో కొనుగోలు చేసి రోగుల దగ్గరి నుంచి రూ.30 తీసుకుంటారు. రోగుల కణాల పరీక్షలకు సంబంధించిన రిజిష్టర్ నిర్వహించడంలేదనే ఆరోపణలున్నాయి. ఓపీ నిర్వహణదీ అదే తీరు. కెమికల్ నెలలో రెండు సార్లు ఖాళీ అవుతుండడంతో రోగులు రూ.200 ఖర్చుతో ప్రయివేటుగా పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా అధికారులు ఈ మారుమూల ఆస్పత్రిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే తప్ప ఆస్పత్రికి పట్టిన జ్వరం వదిలేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
డాక్టర్లు అందుబాటులో ఉన్నారు
–వాసుదేవారెడ్డి, ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్, మహదేవపూర్
ఇద్దరు డాక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. ప్రసవాలు స్థానికంగా జరుగుతున్నాయి. ప్లేట్‌లేట్ పరీక్షలకు ఎక్కువ డబ్బులు తీసుకోవడంలేదు. డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తాం. ఎన్‌బీసీయూలో అన్నీ రకాల పరికరాలు ఉన్నాయి. పిల్లల డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది.