డాక్టర్లు మందులు రాస్తారు.శీతల్ అగర్వాల్ వాటితోపాటు తన నవ్వులను టానిక్‌లా జత చేస్తుంది.శీతల్ బహుశా దేశంలో మొదటి మహిళా ‘మెడికల్ క్లౌన్’.అంటే ఇన్ పేషెంట్స్‌గా ఉన్న చిన్నారులను, వృద్ధులను హుషారుగా పలకరించిఉత్సాహపరిచే విదూషకురాలు. నిరాశ నిస్పృహలను కలిగించే అనారోగ్యం నుంచి బయట పడాలంటే తనలాంటి వారు అవసరమని‘కౌన్సిలర్ల’కు బదులుగా ‘క్లౌన్సిలర్లను’ తయారు చేసే సంస్థను స్థాపించిందామె.శీతల్ ఆలోచనను పెద్ద పెద్ద ఆస్పత్రులు ఆహ్వానిస్తున్నాయి.
వినూత్న సేవ
డాక్టర్లే ఆహ్వానిస్తూ
‘మొదట మేము ప్రతి శనివారం ఏదో ఒక హాస్పిటల్‌కు వెళ్లాలని అనుకున్నాం. కాని మాకు వచ్చిన స్పందన చూసి డాక్టర్లు, నర్సులు మమ్మల్ని ఆహ్వానించసాగారు. మందులకు స్పందించనివారు కూడా నవ్వులకు స్పందిస్తున్నారని వారి అభిప్రాయం. ముఖ్యంగా చిన్న పిల్లల ఆస్పత్రుల్లో మెడికల్ క్లౌన్‌ల అవసరం చాలా ఉందని మాకు అర్థమైంది. హాస్పిటల్‌లోని భయాన్ని పోగొట్టాలంటే వారికి మాలాంటి వారు కనపడుతుండాలి. అందుకే ఇన్ పేషెంట్స్‌గా ఉన్న పిల్లలు మా రాక కోసం ఎదురు చూస్తుంటారు. అంతే కాదు వారి ముఖంలో నవ్వును చూసి తల్లిదండ్రులు కార్చే ఆనందబాష్పాలకు విలువ కట్టలేం. – శీతల్
పిల్లలో, పెద్దలో ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనుకోండి... అప్పుడు వారిలో ఒక రకమైన నిర్లిప్తత వచ్చేస్తుంది. వారిని అటెండ్ చేస్తున్న అయినవారిలో అలసట వచ్చేస్తుంది. నవ్వులు మర్చిపోతారు. ఉత్సాహం మర్చిపోతారు. అప్పుడు ఎవరైనా వచ్చి, వింత వింత చేష్టలు చేసి, పిచ్చి మాటలు చెప్పి హాయిగా నవ్విస్తే ఎలా ఉంటుంది? తిరిగి బలం రాదూ? శీతల్ అగర్వాల్ చేస్తున్నది అదే. నవ్వుతో రోగుల్లో జీవాన్ని తేవడం.
హాస్పిటల్‌లో జోకర్
ఇంగ్లిష్‌లో క్లౌన్ అంటే విదూషకుడు. కాని జన సామాన్యం జోకర్ అనీ బఫూన్ అనీ అంటుంటారు. అలాంటి బఫూన్ వేషంలో హాస్పిటల్‌లో ప్రవేశించి ఒక ఉత్సాహకరమైన వాతావరణం తేవడాన్నే ‘మెడికల్ క్లౌనింగ్’ అంటారు. ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల శీతల్ అగర్వాల్‌కు ఈ మెడికల్ క్లౌనింగ్ గురించి 2016 వరకూ తెలియదు. సోషల్ ఆంత్రోపాలజీ చదివి, లాఫ్టర్ యోగా థెరపీ నేర్చుకుని, ఒక ఎన్.జి.ఓలో ఉద్యోగం చేస్తున్న శీతల్ 2016 సంవత్సరంలో అహ్మదాబాద్‌కు వెళ్లినప్పుడు అక్కడి ఒక హాస్పిటల్‌లో మెడికల్ క్లౌన్‌ను చూసింది. అతను బఫూన్ వేషం వేసుకుని పేషెంట్స్‌ను హుషారు పరచడం శీతల్‌కు చాలా నచ్చింది. ఢిల్లీకి తిరిగి వచ్చి నెట్‌లో మెడికల్ క్లౌనింగ్ గురించి తెలుసుకుంది. దేశంలో కొంత మంది ఇలాంటి సేవ చేస్తున్నారని, హాస్పిటల్స్‌లో ఇలాంటి వారి అవసరం ఉందని తెలుసుకుంది.
ఒక్కతే మొదలయ్యి
‘ఢిల్లీలో అప్పటి వరకూ మెడికల్ క్లౌన్‌గా ఎవరూ పని చేయడం లేదు. ఫేస్‌బుక్‌లో నేను పోస్ట్ చేసి ఆసక్తి ఉందా ఎవరికైనా అని అడిగితే కొంతమంది స్పందించారు. నేను కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుని మొదట ఐదుమందితో ఒక గ్రూప్ మొదలుపెట్టాను. మాకు ట్రైనింగ్ ఏమీ లేదు. తెలిసిందల్లా ఎదుటివారికి మనస్ఫూర్తిగా ఉల్లాసం అందించడమే. అదే సంవత్సరం నేను ఢిల్లీలోని ‘చాచా నెహ్రూ హాస్పిటల్’లో మొదటిసారిగా మెడికల్ క్లౌనింగ్ చేశాను.
కాని ఎలా చేయబోతామా అనే భయం చాలా కలిగింది. మేం వెళ్లేసరికి పిల్లలు చాలామంది ఏడుస్తున్నారు. పేషెంట్లు వెయిటింగ్‌లో ఈసురోమంటున్నారు. కాని ఒక్కసారి మేము రంగంలో దిగి వింత చేష్టలతో తమాషా పలకరింపులతో తిరుగాడేసరికి పిల్లలు ఏడుపు ఆపేశారు. అందరిలో కుతూహలం, ఉత్సాహం వచ్చింది. ఐదు ఫ్లోర్లలో ఐదు గంటల పాటు తిరిగితే మా వల్ల అందరి ముఖాల్లో ఆనందం చూసి ఎంతో తృప్తి కలిగింది’ అంది శీతల్ అగర్వాల్.
500 వాలెంటీర్లు
ఈ ఐదారేళ్లలో శీతల్ పిలుపు మేరకు 500 మంది వాలెంటీర్లు మెడికల్ క్లౌన్లుగా ఆమె స్థాపించిన సంస్థ ‘క్లౌన్సెలర్స్’లో నమోదు అయ్యారు. వీరంతా యూనివర్సిటీ విద్యార్థులు, కార్పొరెట్ సంస్థల ఉద్యోగులు. ‘మా జీవితంలో ఇలాంటి పని సంతృప్తిని ఇస్తుంది’ అని వారు ఈ వినూత్న సేవకు వస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కశ్మీర్‌లలో శీతల్ బృందాల సేవలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రుల్లోనే కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు, మానసిక చికిత్సాలయాలకు కూడా వీరు వెళుతున్నారు. ఈ సేవలో మరింతమంది పాల్గొనాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment