ఆదిలాబాద్‌టౌన్: ఆ ఆసుపత్రిలో వైద్యుడు లేడు. అయినా ఆసుపత్రి నిర్వహణకు అనుమతి కావాలని జిల్లా వైద్యాధికారులకు దరఖాస్తు చేరింది. ఆ దరఖాస్తును పరిశీలించిన వైద్యాధికారులు ఆసుపత్రిని పరిశీలించేందుకు సోమవారం వెళ్లగా.. అక్కడి వివరాలు తెలుసుకుని నివ్వెరపోవడం వారి వంతైంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో ఓ జాతీయ నాయకుడి పేరిట ఆస్పత్రి కొనసాగుతోంది. దీనికి గతనెలలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి అనుమతి కోసం దరఖాస్తు వెళ్లింది. ఆ దరఖాస్తును పరిశీలించిన వైద్యారోగ్య శాఖ అధికారులు ఆస్పత్రి తనిఖీకి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో వారు సూచించిన వైద్యుడు లేనేలేడు.
దీనిపై ఆరా తీయగా.. గతంలో నిర్మల్‌లో ఓ వైద్యుడి వద్ద పనిచేస్తున్న వ్యక్తి.. సదరు వైద్యుడి సర్టిఫికెట్లతో అనుమతికి దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నిర్మల్ జిల్లాలో కాకుండా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డీఎంహెచ్‌ఓ సదరు ఆసుపత్రి నిర్వహణకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌ను వివరణ కోరగా ఆస్పత్రి నిర్వహణకు గత నెల దరఖాస్తు చేసుకున్నారని, సంబంధిత వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో అనుమతి నిరాకరించామని తెలిపారు. వారం రోజుల్లో పూర్తి ఆధారాలతో పత్రాలు సమర్పిస్తే అనుమతి ఇస్తామని, నిబంధనలను అతిక్రమించి ఆస్పత్రి నిర్వహణ చేపడితే చర్యలు చేపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment