గోపాల.. గోవింద! | 66 families problems of government activity | Sakshi
Sakshi News home page

గోపాల.. గోవింద!

Published Wed, Aug 23 2017 1:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM

గోపాల.. గోవింద!

గోపాల.. గోవింద!

వీధినపడ్డ 66 జీవితాలు
- చిరుద్యోగులపై బ్రహ్మాస్త్రం
- ఏడాది కాలంగా జాలిచూపని ప్రభుత్వం
- సమ్మె చేయడమే చేసిన నేరం
- భారంగామారిన కుటుంబ పోషణ
- వెలుగులోకి రాని త్రిసభ్య కమిటీ నివేదిక
- తెరపైకి కొత్త నియామకాలు


అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా వ్యాప్తంగా 386 మంది గోపాలమిత్రలు పనిచేస్తుండగా.. ఒక్కొక్కరికి 1500 పశువులకు సంబంధించిన వైద్య సేవల బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు గ్రామాల్లో సేవలందిస్తున్నారు. పశువైద్యాధికారులకు తోడుగా గ్రామాల్లో తమ వంతు పశువైద్యం చేస్తున్నారు. చేసిన సేవలకు గ్రామాల్లో రైతులు ఇచ్చే రూ.100, రూ.200లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మేలుజాతి పశుసంపద అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థ ఏర్పాటయింది. స్వయం ఉపాధి కింద నిరుద్యోగ అభ్యర్థులను గోపాలమిత్రలుగా తీసుకుని శిక్షణనిచ్చారు. ఎలాంటి గౌరవ వేతనం లేకుండా సేవలు అందించాల్సి ఉండటంతో మున్ముందు భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో కాలం నెట్టుకొచ్చారు. తాజాగా అదే చంద్రబాబు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 66 మంది గోపాలమిత్రలను విధుల నుంచి తొలగించింది. ‘బాబు వస్తే జాబులు వస్తాయి’ అంటూ 2014 ఎన్నికల ముందు ఊరూరా గోడరాతలతో ఊదరగొడ్డిన చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత ఉన్న ఉద్యోగాలను తొలగించడం పట్ల గోపాలమిత్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దివంగత సీఎం వైఎస్‌ హయాంలో గౌరవ వేతనం
వెట్టిచాకిరితో బతుకులు సాగిస్తున్న గోపాలమిత్రల కష్టాన్ని గుర్తించిన దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలుత నెలసరి గౌరవ వేతనం రూ.1500 చేయడంతో ఉపశమనం పొందారు. కొద్ది నెలలకే రూ.2 వేలు.. ఆ తర్వాత రూ.2,500 చేశారు. ప్రస్తుతం గౌరవ వేతనం రూ.3,500 ప్రకారం చెల్లిస్తున్నారు. మళ్లీ చంద్రబాబు సర్కారు రావడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల తరహాలో తమకు కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్, ప్రమాదబీమా పెంపుతో ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో 2016 జూన్‌ నెలలో సమ్మెకు దిగారు. అదే వారికి శాపంగా మారింది. నెలల తరబడి వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో చేసేది లేక గోపాలమిత్రలు విధుల్లో చేరిపోయారు. అయితే వరుసగా రెండు నెలల పాటు సమ్మెలో ఉన్న 66 మం‍దిని మాత్రం ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ విషయమై త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన నివేదిక బహిర్గతం చేయకుండానే కొందరు గోపాలమిత్రలను కొత్తగా చేర్చుకునే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

ఆత్మహత్యాయత్నంతో ఆందోళన
తొలగించిన తమ స్థానాల్లో కొత్త వారిని నియమించి పొట్ట కొడుతున్నారంటూ తలుపుల మండలానికి చెందిన నరసింహులు నాలుగు రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కదిరిలోని ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా ఈ నెల 10న అదే మండలానికి చెందిన 11 మంది గోపాలమిత్రలు పురుగు మందులు డబ్బాలతో డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం ఉద్రిక్తతకు కారణమైంది. ఇకపోతే విధి నిర్వహణలో ఆరుగురు గోపాలమిత్రలు చనిపోగా, 14 మంది వరకు ప్రమాదాల్లో క్షతగాత్రులయ్యారు.

భారంగా విధి నిర్వహణ
ప్రస్తుతం విధుల్లోని గోపాలమిత్రల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పశుసంపద తగ్గిపోయినా లక్ష్యం అధికంగా ఇస్తుండటంతో చేరుకునేందుకు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఫర్టిలిటీ క్యాంపులు, గత మూడు సంవత్సరాలుగా ఇన్సెంటివ్‌లు చెల్లించకపోవడం, ఇతరత్రా సదుపాయాలు తగ్గించేయడంతో దినదిన గండంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పొట్ట మీద కొట్టారు
అరకొర సంపాదనతో బతుకులీడుస్తున్న గోపాలమిత్రలపై డీఎల్‌డీఏ పాలక వర్గం, అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఏ తప్పు చేయకున్నా డిమాండ్ల సాధన కోసం చేసిన ఆందోళనల సాకుతో 66 మందిని తొలగించి పొట్టమీద కొట్టారు. వీరిలో చాలా మంది పేదలు కావడంతో బతుకులు దుర్భరంగా ఉన్నాయి. వీలైనంత త్వరగా వీరి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి.
- వెంకటేష్, గోపాలమిత్రల అసోసియేషన్‌ నాయకుడు

త్రిసభ్య కమిటీ నివేదికను పాటిస్తాం
గతేడాది దీర్ఘకాలిక సమ్మెలోకి వెళ్లడంతో పశుసేవలకు విఘాతం ఏర్పడింది. ఆందోళన విరమించి విధుల్లో చేరాలని పదే పదే చేసిన విజ్ఞప్తి మేరకు చాలా మంది విధుల్లో చేరారు. వరుసగా రెండు నెలల పాటు పనిచేయని 66 మందిని డీఎల్‌డీఏ తీర్మానం, ఏపీఎల్‌డీఏ సీఈఓ ఆదేశాల మేరకు తొలగించాం. త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం నడచుకుంటాం.
- డాక్టర్‌ ఎన్‌.తిరుపాలరెడ్డి, డీఎల్‌డీఏ ఈఓ

ఆవులు, ఎద్దులు            : 6.61 లక్షలు
గేదెలు                    : 3.70 లక్షలు
గొర్రెలు                    : 38.79 లక్షలు
మేకలు                    : 7.85 లక్షలు
గోపాలమిత్ర సెంటర్లు        : 371
పనిచేస్తున్న గోపాలమిత్రలు        : 318 మంది
ఖాళీలు                    : 53 స్థానాలు
తొలగింపులు            : 66 మంది
నెలసరి గౌరవ వేతనం            : 3,500
విధి నిర్వహణలో మృతులు    : 6గురు
ప్రమాదాల్లో క్షతగాత్రులు        : 14 మంది

Advertisement
Advertisement