గుంటూరు లీగల్: సంచలనం సృష్టించిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల దాడి కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు సోమవారం కోర్టులో లొంగిపోయి అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. వివరాలు... విజయవాడకు చెందిన చావలి లక్ష్మి 2015 ఆగస్టు 17న విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు ఆరోగ్య సమస్య రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అదేరోజు రాత్రి 10.30 గంటలకు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా అదే నెల 25న లక్ష్మి తన బిడ్డ ఎలుక కాటుకు గురైనట్లు గమనించి వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లింది.
పరిశీలించిన వైద్యుడు గాయానికి ఆయింట్‌మెంట్ పూయమని చెప్పారు. తిరిగి 26వ తేదీ తెల్లవారుజామున తన బిడ్డ ఎలుక కాటుకు గురైన విషయాన్ని మరోసారి ఆస్పత్రి సిబ్బందికి తెలిపింది. అక్కడ ఉన్న సిబ్బంది గాయాలకు కట్టుకట్టారు కానీ, ఏవిధమైన చికిత్స అందించలేదు. అదేరోజు మద్యాహ్నం 2.45 గంటలకు బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని ఆరోపిస్తూ లక్ష్మి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వార్డు స్టాఫ్‌నర్స్ జి జయజ్యోతి కుమారి, హెడ్‌నర్స్ సీహెచ్ విజయలక్ష్మి, స్టాఫ్‌నర్స్ వి.విజయలక్ష్మి, నర్సింగ్ సూపరింటెండెంట్ కె.పుష్పావతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు, కార్పెంటర్ చందోలు వెంకటప్పయ్య, ఇన్‌చార్చి ఆర్‌ఎంవో డాక్టర్ అనంత శ్రీనివాసులు నిందితులుగా పేర్కొన్నారు. వీరందరూ సోమవారం తమ న్యాయవాది కొమ్మా రమేష్ ద్వారా కోర్టులో లొంగిపోయారు. అనంతరం న్యాయమూర్తి కె.ప్రత్యూష కుమారి వీరందరికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల15వ తేదీకి వాయిదా వేశారు.
'ఎలుక దాడి' కేసులో లొంగిపోయిన నిందితులు
Published Mon, Feb 1 2016 10:14 PM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement
Advertisement