మాట్లాడుతున్న కాటమనేని రమేష్
- lఅండర్–13, 15 పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులు
- పోటీలకు హాజరు కానున్న 150 మంది క్రీడాకారులు
- టోర్నీ వేదికగా సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియం
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అండర్ –13, 15 బాలబాలికల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కాటమనేని రమేష్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీలకు ముందురోజైన 7వ తేదీన క్వాలిఫైయింగ్ ఉంటుందని, 8 నుంచి 10 వ తేదీ వరకు అధికారిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాలనుంచి 150 మంది క్రీడాకారులు హాజరు కానున్నట్లు చెప్పారు. వారందరికీ నగరంలోని పలుహోటళ్లలో వసతితో పాటు ఉచిత భోజన వసతి కల్పించినట్లు తెలి పారు. పోటీలకు వేదికగా నగరంలోని సర్ధార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని వివరించారు. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) ఎండీ దినకర్ బాబు, జేసీ దివ్య హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాలసాని ఆనంద్ మాట్లాడుతూ క్రీడాకారుల సౌకర్యార్థం టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల కోసం అన్ని వసతులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి కె. శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్యదర్శి నల్లమోతు రఘులు పాల్గొన్నారు.