8,207 ఇళ్లు మంజూరు
అనంతపురం అర్బన్ : జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు ఏడు మునిసిపాలిటీకు పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 8,207 ఇళ్లు మంజూరయ్యాయని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. గృహ నిర్మాణానికి అవసరమైన రుణాన్ని లబ్ధిదారులకు బ్యాంకర్లు త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏల్‌డీఎంను ఆదేశించారు. శనివారం పట్టణ గృహ నిర్మాణాలపై ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
జేసీ మాట్లాడుతూ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద గుంతకల్లు మునిసిపాలిటీకి 2,000, అనంతపురం కార్పొరేషన్‌కి 2,000, ధర్మవరానికి 1,400, రాయదుర్గంకి 1,307, హిందూపురానికి 500, కదిరి మునిసిపాలిటీకి 1,000 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. పథకం కింద ఒక్కో గృహ నిర్మాణ వ్యయం రూ.3.50 లక్షలు అన్నారు. ఇందులో సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఇస్తుందన్నారు. లబ్ధిదారుని వాటా రూ.25 వేలు, బ్యాంకు రుణంగా రూ.75 వేలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారులకు బ్యాంక్ రుణం రూ.75 వేలు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.