ఉరవకొండ: పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పాలనలో ఇళ్ల పట్టాలు పొందినా ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియవు. అడిగినా చూపేవారు లేరు. ఇక తమ ఆశలు అడియాసలయ్యాయనుకుంటున్న వేళ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 25 వైకుంఠ ఏకాదశి రోజున ఇళ్ల పట్టాల మంజూరుతో పాటు పక్కాగృహాల నిర్మాణాలు చేపట్టనుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు నివేశన స్థలాల పంపిణీ కోసం 2008లో ఉరవకొండ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో 88 ఎకరాల భూమిని కొనుగోలు చేయించారు.
నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఈ మేరకు భూమి సేకరించారు. అనంతరం టీడీపీ అధికారంలోకొచ్చింది. అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడానికి అవకాశం ఉన్నా తాత్సారం చేశారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసుకుని లబ్ధి పొందేందుకు అసమగ్ర వివరాలతో కూడిన మూడు వేల పట్టాలను హడావుడిగా ఉరవకొండలో పంపిణీ చేశారు. అయితే 15 సర్వే నంబర్లతో పేర్కొన్న పట్టాలో ఎవరి స్థలం ఎక్కడుందో చూపించలేకపోయారు. చెక్కు బందీలు లేవు.. ఎవరు ఎక్కడో తెలీదు.. అయినా పక్కాగృహాలు కూడా మంజూరైనట్లు ప్రకటించారు. ఓట్ల కోసమే ఈ డ్రామా ఆడారని పేదలకు నిదానంగా అర్థమయ్యింది.
సొంతింటి కల సాకారమైందిలా..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు ఇచ్చిన హామీ మేరకు ఇంటి పట్టా, పక్కా గృహ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హులైన పేదలందరికీ పట్టాలు మంజూరు చేయనున్నారు. తాజాగా 8,651 మందికి ఇంటి పట్టాలు ఇవ్వనుండగా.. గత టీడీపీ హయాంలో పక్కాగృహాలు మంజూరై నిర్మాణాలు చేపట్టని వారిని కూడా కలుపుకొని 25,391 మందిని ‘అందరికీ ఇళ్లు’ పథకంలో చేర్చారు.
ఇళ్ల మంజూరులో రెండోస్థానం
పేదలకు పక్కా ఇళ్ల మంజూరులో రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా తరువాత ఉరవకొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా 25,391 పక్కాగృహాలు మంజూరయ్యాయి. పక్కా ఇళ్ల మంజూరులో రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచింది. ఈసారి ఇస్తున్న పట్టాలో స్థలం, చెక్కుబందీలు స్పష్టంగా కనబరిచారు. నివేశన స్థలాల కోసం ఎంపిక చేసిన లే అవుట్‌లో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.
సంతోషంగా ఉంది
ఎన్నో ఏళ్ల నుంచి ఇంటి పట్టా కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. జగనన్న ప్రభుత్వం మాకు ఇంటి పట్టా మంజూరు చేసి ఈ నెల 25న అందిస్తోంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంటి పట్టాతో పాటు పక్కా ఇల్లు కట్టిస్తుండటంతో నాసంతోషం మాటల్లో చెప్పలేను.
– బీబీ, పదో వార్డు, ఉరవకొండ
పార్టీలకతీతంగా ఇంటి పట్టా
అర్హులైన ప్రతి పేదవారికీ జగనన్న ప్రభుత్వం ఇంటి పట్టా అందించబోతోంది. గత టీడీపీ హయంలో ఇంటి పట్టా కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం పారీ్టలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పట్టా, పక్కా ఇల్లు మంజూరు అవుతోంది.
– ఏసీ పార్వతమ్మ, అంబేడ్కర్‌నగర్, ఉరవకొండ
Comments
Please login to add a commentAdd a comment