సాక్షి, అమరావతి/రాప్తాడు: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఓ వైపు ప్రజాబలమే గీటు రాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరో వైపు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే 65 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించిన సీఎం జగన్.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భీమిలిలో గత నెల 27న, ఉత్తర కోస్తా ప్రాంతానికి సంబంధించి ఈనెల 3న ఏలూరులో ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహించారు. భీమిలి సభకు సముద్రపు కెరటాలతో పోటీపడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం పోటెత్తితే.. ఏలూరు సభకు ఉత్తర కోస్తా ప్రజలు కడలిలా కదలివచ్చారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా మూడో సభను ఆదివారం అనంతపురానికి సమీపంలో రాప్తాడు వద్ద నిర్వహిస్తున్నారు.
రాయలసీమ ప్రాంతంలోని 50 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో 250 ఎకరాలకుపైగా ఉన్న సువిశాల మైదానంలో సభకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాగా, భీమిలి, ఏలూరులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. పొత్తులు తేలక ప్రతిపక్ష పార్టీల సభలు వెలవెలబోతున్నాయి.
సీఎం సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సభకు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి శనివారం పరిశీలించారు.
సభ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుందని, రాయలసీమలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది తరలిరానున్నట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి వేర్వేరుగా ఈ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారే తప్ప తాము రాష్ట్రానికి ఇది చేశామని చెప్పుకోలేకపోతున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమీ ఉండబోదని తేల్చిచెప్పారు. మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ప్రజలందరూ జగనన్నకు తోడుగా ఉన్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి ప్రొగ్రామ్స్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఉరవకొండ, శింగనమల సమన్వయకర్తలు విశ్వేశ్వర రెడ్డి, వీరాంజనేయులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, డిప్యూటీ మేయర్ కోగటం భాస్కర్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ మాల్యవంతం మంజుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment