– జిల్లాకు 29,500 ఇళ్లు కేటాయింపు
– లబ్ధిదారుల ఎంపికకు మూడ్రోజులే గడువు
– ఇప్పటి వరకు అందని జాబితా
– జన్మభూమి కమిటీలకు పెత్తనమివ్వడమే ఆలస్యానికి కారణం
ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీం కింద రెండేళ్లకు గాను 29,500 ఇళ్లను జిల్లాకు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈనెలాఖరులోగా జాబితాను గృహ నిర్మాణ సంస్థ అధికారులకు అందించాలి. ఇప్పటి వరకూ ఏ నియోజకవర్గం నుంచి కూడా లబ్ధిదారుల జాబితా అందని పరిస్థితి. సాక్షాత్తూ గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇలాఖాలోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం.
- అనంతపురం టౌన్
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ఒక్క ఇంటినీ నిర్మించలేదు. ఎక్కడికక్కడ ప్రజావ్యతిరేకత రావడంతో ఆలస్యంగా పేదోడి సొంతింటి కలను సాకారం చేయాలని భావించింది. ఇందులో భాగంగా గతేడాది 16 వేల ఇళ్లను ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీం కింద మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తి చేయాల్సి ఉన్నా రాజకీయ కారణాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. గతేడాదికి సంబంధించి ఇంకా 1,105 ఇళ్లకు లబ్ధిదారుల జాబితా అధికారులకు అందని దుస్థితి. ఇక 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి తాజాగా 29,500 ఇళ్లను కేటాయించగా లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది.
ఏడాదికి 14,750 ఇళ్లు కేటాయింపు
జిల్లాకు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద తాజాగా 29,500 ఇళ్లు కేటాయించారు. అనంతపురం నియోజకవర్గానికి 450 .. మిగిలిన వాటిలో ఒక్కో నియోజకవర్గానికి 1,100 ఇళ్లు కేటాయించారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 14,750 వేల ఇళ్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో మరో 14,750 వేల ఇళ్లు నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అంటే ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో 1,100 ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో ఎస్సీలకు 192, ఎస్టీలకు 45, మైనార్టీలకు 9, బీసీలు, ఇతరులకు కలిపి 854 చొప్పున ప్రతి నియోజకవర్గంలో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. వచ్చే ఏడాది కూడా ఇదే ప్రాతిపదికను అనుసరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలు
ఇంటికి అందిస్తున్న మొత్తం విలువ పూర్తి రాయితీగా అందనుంది. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరు చేస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ రాయితీ రూ.92 వేలు, మరుగుదొడ్డి కోసం అదనపు రాయితీ రూ. 3 వేలు, ఉపాధి హామీ పథకం కింద రూ.55 వేలు సమకూర్చుతారు. ఉపాధి నిధులు రూ.55 వేలకు సంబంధించి రోజుకు రూ.194 వేతనం కింద 90 రోజులకు రూ.17,460, ఇటుకలు, బ్లాక్స్ మేకింగ్ కోసం రూ.25,540, మరుగుదొడ్డికి రూ.12 వేలు అందిస్తారు. ప్రతి లబ్ధిదారుడికి రేషన్‌కార్డు, ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
చాలా చోట్ల గ్రామ సభలు నిర్వహించని వైనం
లబ్ధిదారుల ఎంపిక బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులకే అప్పగించారు. జన్మభూమి కమిటీలు గ్రామ సభ నిర్వహించి పంచాయతీ స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ చాలా చోట్ల గ్రామ సభలు నిర్వహించని దుస్థితి. జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో రాజకీయ కూడికలు, తీసివేతల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుండడంతో ఈ పరిస్థితి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 31లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉంది. దీనికి ఇక మూడ్రోజులే గడువు ఉంది. ఇంత వరకు అసలు ప్రక్రియే గ్రామ స్థాయిలో ప్రారంభం కాలేదు.
జన్మభూమి కమిటీల ఆమోదం తప్పనిసరి
గ్రామ సభలు నిర్వహించి జన్మభూమి కమిటీల ఆమోదంతోనే లబ్ధిదారుల జాబితా రావాల్సి ఉంది. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. లబ్ధిదారుల ఎంపిక నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆలోపు వస్తాయని భావిస్తున్నాం.
– రాజశేఖర్, హౌసింగ్ పీడీ
ఈ ఏడాది మంజూరు చేసిన ఇళ్లు
ఎస్సీ వర్గాలకు : 2,573
ఎస్టీలకు : 602
మైనార్టీలకు : 850
బీసీలు, ఇతరులకు : 10,725
మొత్తం ఇళ్లు : 14,750