joint collector laxmikantham
-
ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్
అనంతపురం అర్బన్ : మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం, కుటుంబం ఆరోగ్యంగా ఉంటాయని, వారి ఆరోగ్యరీత్యా ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఉండాలని, అదే విధంగా వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి అని జేసీ లక్ష్మీకాంతం అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక అంబేడ్కర్ నగర్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కట్టెలు, కిరోసిన్ పొయ్యిపై వంట చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్నారు. అదే విధంగా బహిరంగ మలవిసర్జన కారణంగా అనారోగ్యం పాలవుతారన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్ పొందాలని, మరుగుదొడ్డి కట్టించుకోవాలని సూచించారు. స్వచ్ఛంధ సంస్థలు, సామాజిక సేవాసంస్థలు ముందుకొచ్చి నిరుపేదలకు గ్యాస్ డిపాజిట్ చెల్లించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్యాస్ ఏజెన్సీలతో తమ పరి«ధిలోని ఎస్సీ కాలనీల్లో గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేయించామన్నారు. అనంతరం 40 మందికి గ్యాస్ కనెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సరోజమ్మ, పౌర సరఫరాల సంస్థ డీఎం డి.శివశంకర్‌రెడ్డి, ఏఎస్ఓలు ప్రేమ్‌కుమార్, సౌభాగ్యలక్ష్మీ, ఐఓసీ ఏజెన్సీ ప్రతినిధి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
8,207 ఇళ్లు మంజూరు
అనంతపురం అర్బన్ : జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు ఏడు మునిసిపాలిటీకు పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 8,207 ఇళ్లు మంజూరయ్యాయని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. గృహ నిర్మాణానికి అవసరమైన రుణాన్ని లబ్ధిదారులకు బ్యాంకర్లు త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏల్డీఎంను ఆదేశించారు. శనివారం పట్టణ గృహ నిర్మాణాలపై ఆయన తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద గుంతకల్లు మునిసిపాలిటీకి 2,000, అనంతపురం కార్పొరేషన్‌కి 2,000, ధర్మవరానికి 1,400, రాయదుర్గంకి 1,307, హిందూపురానికి 500, కదిరి మునిసిపాలిటీకి 1,000 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. పథకం కింద ఒక్కో గృహ నిర్మాణ వ్యయం రూ.3.50 లక్షలు అన్నారు. ఇందులో సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఇస్తుందన్నారు. లబ్ధిదారుని వాటా రూ.25 వేలు, బ్యాంకు రుణంగా రూ.75 వేలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లబ్ధిదారులకు బ్యాంక్ రుణం రూ.75 వేలు త్వరితగతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. -
15 సూత్రాల కార్యక్రమం పై సమీక్ష
అనంతపురం అర్బన్ : మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం జిల్లాలో సంపూర్ణ స్థాయిలో అమలు కావాలని అధికారులను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో 15 సూత్రాల కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమంపై ప్రతి అధికారి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మైనార్టీ రుణాలు గత ఏడాదిలో 100 యూనిట్ల ఇవ్వగా ఈ ఏడాది 40 మాత్రమే ఇచ్చారని ఈ సంఖ్య పెంచాలని 15 సూత్రాల సభ్యుడు ఈటెస్వామిదాస్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. -
బకాయిల చెల్లింపునకు వెసులుబాటు
అనంతపురం అర్బ¯న్ : పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో మున్సిపల్ పన్నులు, ఇతరత్రా ప్రభుత్వ సంస్థలకు చెల్లించే బకాయిలను శుక్రవారం సాయంత్రం లోగా ఆయా సంస్థలో చెల్లించవచ్చునని జాయింట్ కలెక్టర్ లక్ష్మికాంతం ఒక ప్రకటలో తెలిపారు. పాత నోట్లను కౌంటర్లో స్వీకరిస్తారని తెలిపారు. -
గ్యాస్ ఏజెన్సీలపై జేసీ దాడులు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం దాడులు నిర్వహించారు. గురువారం కోవూరు, పడుగుపాడు, నెల్లూరులో దాడులు చేసిన ఆయన పలు గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కోవూరులోని వెంకయ్యస్వామి భారత్ గ్యాస్ ఏజెన్సీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు దాడుల్లో తేలింది. గురువారం సాక్షి దినపత్రికలో ‘ఏజెన్సీల ఇష్టారాజ్యం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జేసీ స్పందించారు. సిలిండర్ రూ.418కు విక్రయించాల్సిన ఏజెన్సీ నిర్వాహకుడు రూ.440కి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు జేసీ తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వెంకయ్యస్వామి భారత్‌గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు రూ.10వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకపై జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీలపై దాడులు ఉంటాయన్నారు. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు నిబంధలనమేరకు గ్యాస్ పంపిణీ చేయాలన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులకు గురిచేసినా సహించేందిలేదని హెచ్చరించారు. వినియోగదారులపై గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు అమర్యాదగా వ్యవహరించరాదన్నారు. ఎటువంటి ఫిర్యాదులు అందినా విచారణ చేపట్టి ఆయా ఏజెన్సీలను సీజ్‌చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఏఎస్ఓ శంకరన్ పాల్గొన్నారు.