9 మంది సామాన్య పౌరులను చంపారు!
- హత్యకు గురైన వారిలో 22 మంది మావోలే!
- ఏపీ డీజీపీ రాకకు స్వాగతంగా నలుగురు పౌరుల హత్య
- మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట ఆడియో టేపుల విడుదల
హుకుంపేట: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మల్కన్‌గిరి జిల్లా, రామగూడ గ్రామం సమీపంలో అక్టోబర్ 24వ తేదీన జరిగిన పోలీసు కాల్పులల్లో మొత్తం 31 మంది చనిపోయారని వీరిలో 22 మంది మావోయిస్టులు కాగా, మరో తొమ్మిది మంది సాధారణ పౌరులని మావోయిస్టు పార్టీ తెలిపింది. మావోయిస్టు పార్టీ ఏఓబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట బుధవారం ఆడియో టేపులు విడుదలయ్యాయి. పోలీసులు ఏవోబీలో కూంబింగ్ చర్యలు ఆపని పక్షంలో మావోయిస్టు పార్టీ నుంచి ప్రతిఘటన తప్పదని జగబంధు హెచ్చరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘31 మంది కామ్రేడ్స్ హత్యపై పోలీసులు పూర్తి అవాస్తవాలు చెబుతున్నారు. పోలీసుల దిగ్బంధం వల్ల ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో ఆలస్యం జరిగింది.
వాస్తవమేమంటే.. 23న రామగూడకి చేరుకొని రాత్రికి అక్కడే పడుకున్నాం. 24న ఉదయం ప్రజలు మాకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిం చగా పోలీసులు వారిని అడ్డుకొని నిర్బంధిం చారు. ఉదయం 6 గంటల సమయంలో రెండు వైపుల నుంచి పోలీసులు అతి సమీపానికి రాగా, అప్రమత్తమైన పీఎల్‌సీఏ కాల్పులు ప్రారంభించింది. ఆ సమయంలో మాతో పాటు ఉన్న చుట్టుపక్క గ్రామాల నిరాయుధులైన యువతీ యువకులు పక్క గ్రామానికి పరిగెత్తారు. వారిపైనా, పక్కనే నది వద్ద ప్రయాణికులపైనా పోలీసులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఘటనలో అనేక మంది గాయపడ్డారు. వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నారు. అయితే అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
మైదానంలో విచ్చలవిడి కాల్పులు
వారిని ప్రతిఘటిస్తూనే పక్కనే ఉన్న కొండలపైకి మేం సురక్షితంగా చేరాం. అప్పటికే మా మకాంను రెండు వలయాల పోలీసులు చుట్టివేశారు. ఒక వలయాన్ని ఛేదించి సురక్షితంగానే బయటపడ్డాం. తర్వాత మరో వలయం చుట్టివేసింది. వారంతా కొండలను ఆక్రమించుకొని మా దిశను గుర్తించి అన్ని దిశల్లో కాల్పులు ప్రారంభించారు. అప్పటికే కాల్పులు ప్రారంభమై గంట గడిచింది. చివరి వలయాన్ని ఛేదించే క్రమంలో ఒక కొండ నుంచి మరో కొండకు వెళ్లేటప్పుడు చిన్న మైదానాన్ని దాటాల్సి వచ్చింది. వందలాది మంది పోలీసు లు అనుకూల రక్షణ ఉండే కొండలపైకి చేరి మమ్మల్ని చుట్టుముట్టి, విచ్చలవిడిగా కాల్పు లు జరిపారు. దీంతో కొంత మంది కామ్రేడ్స్ అమరులై అనేక మంది గాయపడ్డారు.
గాయాలైన వారిని హతమార్చారు
గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న కొంతమంది కామ్రేడ్స్‌ను వందలాది బలగాలు చుట్టుముట్టి హతమార్చాయి. 27వ తారీఖున అదనపు బలగాలను రప్పించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి గాయపడి ఉన్న కామ్రేడ్స్‌ను తప్పించుకోనీయకుండా వెతికారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాకకు స్వాగతంగా అప్పటికే వారి చేతుల్లో ఉన్న నలుగురు సాధారణ యువతీ యువకులైన కుదిరిగుడ కొమలి, శ్యామల పిల్లిపొదిరి, కావేరి ముదిలి-లచ్చ ముదిలి, డక్క ముదిలినిలను కాల్చి చంపి మరో ఎన్‌కౌంటర్ కథనాన్ని అల్లారు.
గాయపడి శత్రు వలయంలో చిక్కిన మరో మహిళా కామ్రేడ్‌ను 26న రామగూడ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపారు. అలాగే గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న మరో ఇద్దరు కామ్రేడ్లు గౌతమ్, నరేశ్‌లను 27 ఉదయం 7 గంటలకు గ్రామ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపి ఎన్‌కౌంటర్ కథను అల్లారు. మా కామ్రేడ్స్ ఈ ఎన్‌కౌంటర్ ఎదుర్కోవడంతో అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని, త్యాగాన్ని ప్రదర్శించారు. వారు అమరులవుతూ కూడా వారి చేతుల్లోని ఆయుధాలను శత్రువుల చేతికి చిక్కకుండా సహచర కామ్రేడ్లకు అందిస్తూ అమరులయ్యారు. ఈ హత్యా ఘటనలో 24వ తే దీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 31 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. అందులో 9 మంది నిరాయుధులైన సాధారణ యువతీ యువకులే.
రాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటాం
మా అమరుల శవాల పట్ల కూడా పోలీసులు అభ్యంతర వైఖరి ప్రదర్శించారు. వారు కుటుంబ సభ్యులు గుర్తుపట్టకుండా చేసి, పెట్టెల్లో పెట్టారు. మా కామ్రేడ్స్‌ను హత్య చేసిన రాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది శాంతి భద్రతల సమస్య కాదు. నూటికి 90 మందిగా ఉన్న పేదల సమస్య. మా పార్టీకి త్యాగాలు కొత్త కాదు. ఈ హత్య కాండను ప్రజలు, పౌర సంఘాలు ఖండించాలి. దున్నేవారికే భూములు అన్న దానిపై పోరాటాలు జరిపాం. ఈ ఘటనకు మా లోపాలు ఉన్నాయి. వాటిని పునఃసమీక్షించుకుంటాం. అలాగే ఈ హత్యాకాండకు లొంగిపోయిన మాజీల (మాజీ మావోయిస్టులు) సహకారం కూడా తీసుకున్నారు. ప్రజల సహకారంతోనే విప్లవ ద్రోహులను శిక్షిస్తాం.’’ అని ఆడియో టేపులో జనబంధు పేర్కొన్నారు. ఏఓబీలో వెంటనే కూంబింగ్‌ను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.