
చిరునవ్వును.. చిదిమేశారా..?
బాలుడి అదృశ్యం.. విషాదాంతం
ఖమ్మం జిల్లాలోని బావిలో శవమై తేలిన బాలుడు
వారం రోజుల తరువాత మృతదేహం లభ్యం
శోకసంద్రంగా మారిన మొగలాయికోట
కోదాడ : మండల పరిధిలోని మొగలాయికోట గ్రామంలో ఇంటి ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడి ఉదంతం విషాదాంతమైంది. వారం రోజుల తరువాత గ్రామానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా రూరల్‌మండలం గుర్రాలపాడు వద్ద ఉన్న బావిలో శవమై తేలాడు. దీంతో వారం రోజులుగా ఎక్కడో ఒక దగ్గర తమ కుమారుడు క్షేమంగానే ఉంటాడనే చిరు ఆశతో ఉన్న బాలుడి కుటుంబం విషయం తెలుసుకుని దుఖసాగరంలో మునిగిపోయింది. వివరాలు.. గ్రామానికి చెందిన లింగా గోపాల్‌రెడ్డి–రమ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు కోదాడలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో ఉండి చదువుకుంటుండగా, చిన్న కుమారుడు లింగా పూరిజగన్నా«ద్‌రెడ్డి(9)ఇదే పాఠశాలలకు రోజు బస్సులో వచ్చి పోతు 2వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 13న బక్రీద్ సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యం అయ్యాడు. ఈ రోజు నుంచి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడమే కాకుండా తీవ్రంగా గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అనూహ్యంగా మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా గుర్రాలపాడు వద్ద వ్యవసాయ భావిలో కుళ్లిపోయిన స్థితిలో బాలుడి శవం తేలడం, అక్కడివారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇచ్చిన సమాచారంతో మృతుడు లింగా పూరిజగన్నా«ద్‌రెడ్డిగా బంధువులు గుర్తించారు.శవాన్ని ఖమ్మంలోనే పంచనామా చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
శత్రువులు లేరంటున్న తల్లిదండ్రులు...
ఇదీలా ఉండగా ఈ కేసులో వారం రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలించినా చిన్న క్లూ కూడా వారికి దొరకలేదు. తమకు శత్రువులు లేరని, ఆస్తి తగాదాలు కూడా లేవని తల్లిదండ్రులు చెబుతుండడం, ఎవ్వరిపై అనుమానం కూడా వ్యక్తం చేయకపోవడంతో కేసు ముందుకు సాగడం లేదు.
ఎవరా ఇద్దరు.. వారి పనేనా...?
ఈ నెల 13వ తేదీన ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి పూరి జగన్నధరెడ్డితో మాట్లాడినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆ దుండగులే బాలుడిని బైక్‌పై ఎక్కించుకు వెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ ఇద్దరు ఎవరనేది చెప్పలేక పోతుండడంతో కేసులో పురోగతి ఉండడం లేదు. కాగా బంధువులు మాత్రం పథకం ప్రకారమే బాలుడిని కిడ్నాప్ చేసి దారుణం హత్య చేసి ఉంటారని, పోలీసులు నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు. 13వ తేదీనే హత్య చేసి ఉంటారని, అందువల్లే మృతదేహం అంతగా కుళ్లిపోయిందని వారు అంటున్నారు.
మిన్నంటిన రోదనలు..
బాలుడి మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం గ్రామానికి తీసుకవచ్చారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పూర్తిగా కుళ్లిపోవడంతో కనీసం బాలుడిని చివరిసారిగా కూడా చూసుకోలేని విషాదపరిస్థితి. సాయంత్రం జోరువాన కురవడంతో ఆ వానలోనే అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలను నిర్వహించారు.