కటకటాల్లోకి కేటుగాడు
మెడికల్ సీట్ ఇప్పిస్తానని దగా
నిందితుడి అరెస్ట్
బంజారాహిల్స్: తాను ఓ మంత్రి పీఏనని, మెడికల్ సీటు ఇప్పిస్తానని డబ్బు తీసుకుని మోసం చేసిన కేటుగాడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చెర్కుపల్లి గ్రామానికి చెందిన మేకల రఘురాంరెడ్డి అలియాస్ రఘుమారెడ్డి తాను ఓ మంత్రి పీఏనని బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని అమృతా ఎన్‌క్లేవ్‌లో నివసించే సయ్యద్ అతర్ హుస్సేన్(20)ను పరిచయం చేసుకున్నాడు. తనకు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో సంబంధాలున్నాయని, గతంలో చాలా మందికి ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించానని నమ్మబలికాడు.అతర్ హుస్సేన్‌కు మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ. 85 లక్షలు వసూలు చేశాడు. సీటు రాకపోవడంతో బాధితుడు నిలదీయగా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ చివరకు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితు అతర్ హుస్సేన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రఘురాంరెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.