కోటయ్యకు కొత్త శోభ
* రూ 3.50 కోట్లతో అభివృద్ధి
* శివరాత్రి నాటికి భక్తులకు అందుబాటులోకి..
నరసరావుపేట రూరల్: ప్రముఖశైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరాలయంలో రూ. 3.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ గాలిగోపురం ముందున్న స్థలాన్ని విస్తరిస్తున్నారు. మల్టీపర్పస్ క్యూకాంప్లెక్స్, రిటైనింగ్ వాల్ తదితర నిర్మాణ పనులు ప్రారంభించారు. రానున్న శివరాత్రి పర్వదినం సమయానికి అయా పనులు పూర్తి చేస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న కోటప్పకొండకు ఇటీవల భక్తుల తాకిడి పెరిగింది. రాజధానికి సమీపంగా ఉండటంతోపాటు అతి పురాతనమైన మేధో దక్షిణామూర్తి స్వరూపంగా పరమశివుడు అవతరించిన ప్రాంతం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. దీంతోపాటు అక్షరాభ్యాస కేంద్రంగా ఈ క్షేత్రానికి ప్రాచుర్యం ఉంది.
కొనసాగుతున్న అభివృద్ధి పనులు...
గాలిగోపురం ముందున్న స్థలాన్ని విస్తరించడంలో పాత త్రిముఖ శివలింగాన్ని తొలగించి కొత్త శివలింగాన్ని రూ.కోటితో ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం టీటీడీ స్తపతి ఇక్కడకు వచ్చి స్థల పరిశీలన చేసి వెళ్లారు. వీరి పర్యవేక్షణలో త్రిముఖ శివలింగం రూపుదిద్దుకోనుంది. మల్టీపర్పస్ క్యూ కాంప్లెక్స్, రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని రూ.2.5 కోట్లతో చేపట్టనున్నారు. ఆలయం వెనుక వైపున ధనలక్ష్మి అతిథిగృహం పక్కన కొండ చరియలు విరిగి పడుతుండటంతో ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు.
క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం..
కోటప్పకొండలో 3.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. త్రిముఖ శివలింగం, మల్టీపర్పస్ క్యూలైన్లు, రిటైనింగ్ వాల్ పనులు నిర్వహిస్తున్నారు. వేగంగా పనులు పూర్తి చేసి శివరాత్రి పర్వదినం నాటికి క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.
– శ్రీనివాసరావు, డీఈ, దేవాదాయ శాఖ