వైద్య వృత్తికి వెళుతూ విధి వక్రించి..
వైద్య వృత్తికి వెళుతూ విధి వక్రించి..
Published Wed, Sep 20 2017 12:13 AM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM
ఫిజియోథెరపిస్ట్ దుర్మరణం
దొమ్మేరులో ఘటన
బంధువులు, స్థానికుల ఆందోళన
7 గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్
కొవ్వూరు రూరల్: కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తాడనుకున్న కొడుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే విగతి జీవిగా మారతాడని ఆ కన్నవాళ్లు ఊహించలేదు. అష్టకష్టాలు పడి ఉన్నత చదువులు చదివించుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్దకొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆస్పత్రికి వెళ్లి రోగులకు సేవలు అందించి వస్తానమ్మా అని ఇంటి నుంచి బయలుదేరిన పావు గంటలోనే కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ తల్లి గుండె చెరువయ్యింది. గుర్తుతెలియని వాహనం మృత్యురూపంలో ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో సొంత ఊరిలోనే ఊపిరిలొదిలాడు కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్ తూతా రమేష్ (25). మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతితో గ్రామం శోకసంద్రంగా మునిగిసోయింది. సంఘటనా ప్రాంతంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలిలా ఉన్నాయి.. దొమ్మేరులోని అనంతలక్ష్మి కాలనీలో నివాసముంటున్న వ్యవసాయ కూలి వెంకటరమణ, సీత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రమేష్‌ను కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. గతేడాది ఫిజియోథెరపిస్ట్ కోర్సు పూర్తిచేసుకున్న రమేష్ రాజానగరం జీఎస్‌ఎల్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం ఉదయం ఇంటి నుంచి విధి నిర్వహణ నిమిత్తం రాజానగరం వెళుతుండగా దొమ్మేరు ప్రధాన సెంటర్‌లో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భారీ వాహనాల రాకతో ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని, తక్షణమే మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, స్థానికులు మృతదేహం వద్ద టెంట్టు వేసి రాస్తారోకో చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఆందోళన సాగింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మృతుడి బంధువులు, ఆందోళనకారులను బలవంతంగా తొలగించి రమేష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement