ప్రేమ పంచాయితీ.. యువకుడి ఆత్మహత్య
హిందూపురం అర్బన్ : ప్రేమ వ్యవహారంలో ఎదురుదెబ్బలు తిన్న ఓ యువకుడు శనివారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు బెదిరించడం.. బయటి వ్యక్తులు దాడికి పాల్పడటం వల్ల మనస్తాపంతోనే ప్రాణాలు తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. బాధితుల కథనం మేరకు... హిందూపురంలోని బోయపేటకు చెందిన సుశీలమ్మ, ఆదినారాయణ కుమారుడు పవన్‌కుమార్(20) బెంగళూరులోని పెట్రోల్ పంపులో పని చేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయితో రెండేళ్ల క్రితం ప్రేమలో పడ్డాడు. ఇద్దరి ఇళ్లలో పెద్దలు మందలించారు.
దీంతో వారిద్దరూ శుక్రవారం ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు సునంద, నరసింహులు మైనర్ అయిన తమ కుమార్తెను పవన్ ఎత్తుకుపోయాడని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పవన్ తండ్రి ఆదినారాయణను స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పవన్‌కుమార్ అమ్మాయితో కలిసి పోలీసుల వద్దకు వచ్చాడు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలిక కావడంతో కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించి ఇద్దరినీ విడదీసి వారి తల్లిదండ్రుల వెంట పంపించారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తులైన ధర్మవరం రవి, గోపి ఈ విషయంలో కల్పించుకుని పవన్‌కుమార్‌ను చితకబాదారు. తీవ్ర మనస్తాపానికి గురైన పవన్‌కుమార్ రాత్రంతా మానసికంగా కృంగిపోయి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉదయాన్నే శవమై కనిపించిన కొడుకును చూసిన తల్లిదండ్రులు సుశీలమ్మ, ఆదినారాయణ, బంధువులు బోరున విలపించారు. చెట్టంత కొడుకును కొట్టి బెదిరించి పోలీసులు, అమ్మాయి బంధువులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ స్థానిక చిన్నమార్కెట్ సర్కిల్ వద్ద పవన్ మృతదేహంతో రాస్తారోకో చేపట్టారు. వారి ఆందోళనతో బెంగళూరు రోడ్డులో రాకపోకలు స్తంభించిపోయాయి. సీఐ మ«ధుసూదన్, సిబ్బంది అక్కడకు చేరుకుని బాధితులను శాంతపరించేదుకు ప్రయత్నించినా వారు వినలేదు. అనంతరం వాల్మీకి సేవాదళ్ నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ, బోయసంఘం నాయకులు అక్కడికి చేరుకుని బాధితులకు బాసటగా నిలిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు అమ్మాయి తల్లిదండ్రులతో పాటు రవి, గోపిలపై 306 సెక‌్షన్ కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.