ఆశలకు కనీస వేతనాలు ఇవ్వాలి
మచిలీపట్నం (చిలకలపూడి) : ఆశ వర్కర్లకు ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయించి అమలు పరచాలని ఏపీ వలంటీర్ హెల్త్ వర్కర్స్ (ఆశ) యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల అన్నారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న పారితోషకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని కోరారు. రెండు నెలలుగా చెల్లించాల్సి ఉన్న పారితోషికం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా యూనిఫాం అలవెన్సును చెల్లించలేదని చెప్పారు. అర్హులైన ఆశ వర్కర్లకు ఏఎన్‌ఎం శిక్షణ ఇచ్చి రెండో ఏఎన్‌ఎంలుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అనంతరం డీఎంహెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకురాళ్లు పి.ధనశ్రీ, పి.కమల, ఎస్.హేమలత, పి స్వరూపరాణి, సీఐటీయు నాయకులు బూర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.