తెనాలి రూరల్ (గుంటూరు) : కట్నం వేధింపుల కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు భారీగా లంచం డిమాండ్ చేసి ఓ ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు ఏసీబీ డీఎస్పీ చంద్రవంశం దేవానంద్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి అయిన తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన సాలడుగు వినయ్‌కుమార్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. సుమారు ఎనిమిది నెలల క్రితం భార్య లక్ష్మితిరుపతి.. వినయ్‌కుమార్ కుటుంబసభ్యులపై కట్నం వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్‌లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు ఇరు పక్షాలు వెళ్లాయి. ఈ నెల 3వ తేదీన కేసు నమోదు చేసినట్టు తాలూకా పోలీసులు వినయ్‌కుమార్‌కు సమాచారం అందించారు. కుటుంబసభ్యులంతా వెళ్లి ఎస్‌ఐ కె. శివరామకృష్ణను కలిసి వచ్చారు. తనకు సెలవులు లేవని, 8వ తేదీన కలుస్తానని చెప్పి వినయ్‌కుమార్ ఎస్‌ఐను అడిగాడు. ఎస్‌ఐ తన పర్సనల్ ఫోన్ నంబరు ఇచ్చి ఫోన్ ద్వారా టచ్‌లో ఉండమని సూచించారు.
రూ.50 వేలు డిమాండ్.. రూ. 25 వేలకు బేరం..
కేసు నమోదైనందున స్టేషను బెయిల్ ఇచ్చేందుకు ఎస్‌ఐ శివరామకృష్ణ వినయ్‌కుమార్‌ను రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ. 25 వేలకు బేరం కుదుర్చుకున్న ఎస్‌ఐ తెనాలి పట్టణ నందులపేటలోని తన ఇంటికి వచ్చి నగదు ఇవ్వాలని సూచించాడు. దీంతో బాధితుడు బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఎస్‌ఐ డిమాండ్ చేసిన విధంగానే రూ. 25 వేలను తీసుకుని గురువారం మధ్యాహ్నం ఎస్‌ఐ ఇంటికి బాధితుడు వెళ్లాడు. ఎస్‌ఐ నగదును తీసుకోగానే అక్కడకు సమీపంలోనే ఉన్న ఏసీబీ గుంటూరు డీఎస్పీ దేవానంద్ శాంతం, సీఐ నరసింహారెడ్డి, సిబ్బంది అవినీతి ఎస్‌ఐను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీన పర్చుకున్నారు.
ప్రొబేషన్ పూర్తికాకముందే..
2002 బ్యాచ్‌కు చెందిన ఎస్ శివరామకృష్ణ తొలుత గ్రేహౌండ్స్‌లో చేసి, 2014లో కన్వర్షన్ కింద సివిల్ పోలీసు విభాగానికి మారారు. సుమారు ఏడాది శిక్షణ అనంతరం తొమ్మిది నెలల క్రితం తొలి పోస్టింగ్ కింద తెనాలి తాలూకాకు వచ్చారు. ఇంకా ప్రొబేషన్ పూర్తి కాకుండానే ఏసీబీ వలకు చిక్కారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఐ
Published Thu, Mar 10 2016 7:30 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement