కళాశాలలో ఏసీబీ తనిఖీలు
వినుకొండ రూరల్: వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద డీఈడీ అండ్ బీఈడీ కాలేజీలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల నేపథ్యంలో అక్రమాల్లో మధ్యవర్తిత్వం వహిçస్తూ వివేకానంద డీఈడీ అండ్ బీఈడీ కళాశాల డైరెక్టర్ సయ్యద్ రఫీ గత నెల 28న ఏసీబీకి పట్టుబడ్డ విషయం విదితమే. ఈ క్రమంలో తనిఖీ నిర్వహించేందుకు ఏసీబీ అధికారులు మంగళవారం కళాశాలకు వద్దకు వచ్చారు. కళాశాలలో సమాచారం ఇచ్చేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పట్టణంలోని వివేకానంద పాఠశాల ప్రిన్సిపల్ నీరజను కాలేజీ వద్దకు పిలిపించారు. రఫీ కుటుంబసభ్యులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఏసీబీ అధికారులు సమాచారం సేకరించేందుకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి స్థానిక తహశీల్దార్ నాగుల్‌సింగ్ సహకారంతో కళాశాలలోని రఫీ కార్యాలయంతో పాటు ఆయన నివాస గృహానికి ఏసీబీ సీఐ నరసింహారెడ్డి సీల్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలోని సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో తమకు కావలసిన సమాచారం తారుమారు చేస్తారనే అనుమానంతో సీల్ వేశామన్నారు. కాలేజీలో చదివే విద్యార్థులకు ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో రఫీ పర్సనల్ రూమ్‌ను మాత్రమే సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో జిల్లా కమర్షియల్ టాక్స్ అధికారి కృష్ణకాంత్, పవన్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.