D.Ed
-
AP TET 2022: ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీటెట్)–ఆగస్టు 2022 శనివారం (నేటి) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 వరకు కంప్యూటరాధారితంగా ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. రాష్ట్రంతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు ఇంతకుముందు ఏడేళ్లుగా ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పుచేసి చెల్లుబాటును జీవితకాలంగా ప్రకటించింది. వెయిటేజీతో పెరిగిన అభ్యర్థులు ఇక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంటు టీచర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుండడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం.. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు. -
టీచర్ ‘చదువులకు’ వెనకాడుతున్నారు
2012లో ఉమ్మడి రాష్ట్రంలో టీచర్ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో చర్యలు తీసుకుంది. భర్తీ ఇంకా పూర్తి కాలేదు. భర్తీలో జాప్యం, ప్రైవేట్‌లో వచ్చే వేతనాలు తక్కువగా ఉండటం టీచర్ కోర్సులపై ప్రభావం చూపుతోంది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సులకు డిమాండ్ తగ్గిపోతోంది. విద్యారంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇచ్చేవేతనాలు చాలక ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. గతంలో టీచర్ కావాలన్న ఆశతో భారీ ఎత్తున ఉపా ధ్యాయ కోర్సులను అభ్యసించగా క్రమంగా డిప్లొమా ఇన్ ఎలి మెంటరీ ఎడ్యు కేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకాడుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. డీఎడ్‌లో గతంలో 11 వేలకుపైగా విద్యార్థులు చేరితే ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలకు పడిపోయింది. అలాగే బీఎడ్‌లోనూ గతంలో 16 వేల మందికిపైగా విద్యార్థులు చేరితే వారి సంఖ్య 12 వేలకు తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరంలో పదుల సంఖ్యలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తగ్గిపోయిన అవకాశాలు.. ఉపాధ్యాయ విద్యలో 2010 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. దీంతో ఆ ప్రభావం నియామకాలపైనా పడుతోంది. ఫలితంగా 2012లో ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ఐదేళ్ల తరువాత 2017లో ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపట్టింది. ఆ నోటిఫికేషన్ ద్వారా 8,972 పోస్టులను భర్తీ చేస్తోంది. ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు రంగంలో ఇచ్చే వేతనాలు తక్కువగా ఉంటుండటంతో ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. డీఎడ్‌కు భారీ దెబ్బ... బీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే డీఎడ్‌లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు అభ్యర్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఒకప్పుడు డీఎడ్‌తోపాటు బీఎడ్ చేసిన వారు కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులే. అయితే 2010లో కొత్త నిబంధనల ప్రకారం బీఎడ్ చేసిన వారు కేవలం స్కూల్ అసిస్టెంట్‌గానే వెళ్లాలని, ఎస్జీటీ పోస్టులకు అనర్హులని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో అప్పటి నుంచి బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది. అయితే గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం మరో నిబంధనను అమల్లోకి తెచ్చింది. బీఎడ్ చేసిన వారు ఉద్యోగం వచ్చాక చైల్డ్ సైకాలజీలో ఆరు నెలల ఇండక్షన్ ట్రైనింగ్ చేస్తే సరిపోతుందని పేర్కొంది. దీంతో డీఎడ్‌లో చేరే వారి సంఖ్య మరింతగా తగ్గిపోయింది. పైగా ఇంటర్ తరువాత రెండేళ్ల డీఎడ్ చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. డిగ్రీ పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటే బీఎడ్ చేయవచ్చన్న ఆలోచన విద్యార్థుల్లో పెరిగిపోయింది. ఒకవేళ డీఎడ్ రెండేళ్లు చేసినా స్కూల్ అసిస్టెంట్ కావాలంటే మళ్లీ మూడేళ్లు డిగ్రీ చేయాలి. దాంతోపాటు మరో రెండేళ్లు బీఎడ్ చేయాల్సి వస్తోంది. వాటి కంటే ఇంటర్ తరువాత డిగ్రీ పూర్తి చేసి ఆ తరువాత బీఎడ్ చేస్తే సరిపోతుందన్న ఆలోచనలకు విద్యార్థులు వస్తున్నారు. దీంతో డీఎడ్వైపు పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. మూసివేతకు యాజమాన్యాల దరఖాస్తులు... రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్ కాలేజీలను నడుపలేమంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. గత ఐదేళ్లలో బీఎడ్, డీఎడ్ కాలేజీల సంఖ్య తగ్గిపోయింది. 2015–16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 225 బీఎడ్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 208కి తగ్గిపోయింది. ఇందులో ఈ విద్యా సంవత్సరంలో 7–8 కాలేజీలు మూతపడ్డాయి. ఇక డీఎడ్ కాలేజీలు 210 ఉండగా ప్రస్తుతం అవి 140కి తగ్గిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో గత విద్యా సంవత్సరంలో 30 కాలేజీలు మూతపడగా ఈ విద్యా సంవత్సరంలో 40 డీఎడ్ కాలేజీలు మూసివేత కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఆ మేరకు కాలేజీలు తగ్గిపోయాయి. -
కళాశాలలో ఏసీబీ తనిఖీలు
వినుకొండ రూరల్: వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద డీఈడీ అండ్ బీఈడీ కాలేజీలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల నేపథ్యంలో అక్రమాల్లో మధ్యవర్తిత్వం వహిçస్తూ వివేకానంద డీఈడీ అండ్ బీఈడీ కళాశాల డైరెక్టర్ సయ్యద్ రఫీ గత నెల 28న ఏసీబీకి పట్టుబడ్డ విషయం విదితమే. ఈ క్రమంలో తనిఖీ నిర్వహించేందుకు ఏసీబీ అధికారులు మంగళవారం కళాశాలకు వద్దకు వచ్చారు. కళాశాలలో సమాచారం ఇచ్చేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పట్టణంలోని వివేకానంద పాఠశాల ప్రిన్సిపల్ నీరజను కాలేజీ వద్దకు పిలిపించారు. రఫీ కుటుంబసభ్యులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఏసీబీ అధికారులు సమాచారం సేకరించేందుకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి స్థానిక తహశీల్దార్ నాగుల్సింగ్ సహకారంతో కళాశాలలోని రఫీ కార్యాలయంతో పాటు ఆయన నివాస గృహానికి ఏసీబీ సీఐ నరసింహారెడ్డి సీల్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలోని సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో తమకు కావలసిన సమాచారం తారుమారు చేస్తారనే అనుమానంతో సీల్ వేశామన్నారు. కాలేజీలో చదివే విద్యార్థులకు ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో రఫీ పర్సనల్ రూమ్‌ను మాత్రమే సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో జిల్లా కమర్షియల్ టాక్స్ అధికారి కృష్ణకాంత్, పవన్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నోటుకు సీటు డీఎడ్‌కు పెరిగిన డిమాండ్
సాక్షి, కర్నూలు: భావి తరాలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను తీర్చిదిద్దే కోర్సులు అంగడి సరుకుగా మారిపోయాయి. డీఎడ్‌కు క్రేజ్ పెరిగిన దృష్ట్యా ప్రైవేట్ కళాశాలలు సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉండటంతో.. సీటు ఖరీదును అభ్యర్థులు లెక్కచేయడం లేదు. ఇదే అదనుగా యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. జిల్లాలో 61 ప్రైవేట్, ఒక ప్రభుత్వ కళాశాలల్లో డీఎడ్‌లో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్, కళాశాలల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది మే 31న ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అభ్యర్థులు నాలుగు నెలల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అంతా సవ్యంగా సాగి ఉంటే కళాశాలలు రెండు నెలల కిందటే ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో వసతుల మాట ఎలా ఉన్నా యాజమాన్య కోటాలో సీటు దక్కించుకుందామనుకునే వారికి పలు కళాశాలలు చుక్కలు చూపుతున్నాయి. కన్వీనర్ కోటాలో ఫీజు రూ.12,500 మాత్రమే కాగా.. యాజమాన్య కోటాలో రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల పైగా ధర పలుకుతోంది. కళాశాలలు అధికంగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో ఈ బేరం శ్రుతి మించింది. చాలా కళాశాలలు ప్రవేశాల ప్రక్రియకు ముందే ఫీజులో కొంత మొత్తం తీసుకుని సీట్లు ఖాయం చేసుకోవడం గమనార్హం. డిమాండ్‌ను అంచనా వేస్తూ.. మిగతా సీట్ల ధరను నిర్ణయిస్తుండటంతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఒక్కో ప్రైవేట్ కళాశాలలో 50 సీట్లు ఉంటే పది యాజమాన్య కోటాలో భర్తీ చేసుకునే వీలుండగా.. మిగతా వాటికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఏ కాలేజీకి వెళ్లినా ఇదే స్పందన ఫలానా సార్ చెప్పారు కనుక ఓ పది వేలు తగ్గిస్తాం. అంతకన్నా ఏమీ చేయలేం. సీటు.. హాజరు ధర వేర్వేరు. తరగతులకు రాకుంటే మాత్రం అదనంగా ఇవ్వాలి. క్షమించండి.. సీట్లు లేవు. మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక్కటి ఖాయం చేస్తాం. మేం చెప్పిన ధరకు ఒక్క పైసా తగ్గొద్దు. అంతగా బతిమాలుతున్నారు కాబట్టి సీటు ఇస్తాం. ధర ఎవరికీ చెప్పొద్దు. అందరికీ అదే ధరకు ఇవ్వలేం. తప్పని తిప్పలు అసలే కళాశాలలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో విద్యార్థులకు అందేది అత్తెసరు బోధనే అనేది సుస్పష్టం. నెలాఖరు వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగనుండడంతో కళాశాలలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. మరోవైపు జిల్లాలోని మొత్తం కళాశాలల్లో సగం ఈ ఏడాది కొత్తగా పుట్టుకొచ్చినవే. వీటిలో పూర్తిస్థాయిలో వసతులు లేనట్లు విద్యార్థులు, సంబంధీకులు గుర్తించారు. అయినా ఎలాగోలా డీఎడ్ పట్టా అందుకోవాలనే ఆశతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రం కావడంతో కళాశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. పెరిగిన పోటీ జిల్లాలో ఈ ఏడాది తెలుగు మాధ్యమంలో 28,720 మంది డైట్‌సెట్ రాశారు. 10వేల మందికి పైగా అర్హత సాధించారు. వీరంతా ర్యాంకుల ఆధారంగా జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లో ప్రవేశాలకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలామంది కన్వీనర్ కోటాలో సీటు పొందారు. మరో విడత కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యారు. తెలుగు మాధ్యమంలో ఉన్న 3,050 సీట్లలో కన్వీనర్ కోటాలో ఉండే 2,440 పోగా.. మిగతావారంతా యాజమాన్య కోటాపైనే ఆధారపడాల్సి ఉంది. ఉర్దూ మాధ్యమంలో 1,025 మంది పరీక్ష రాయగా సుమారు 200 మంది పైగా విద్యార్థులు అర్హత సాధించారు. కన్వీనర్ కోటాలోని 40 సీట్లు భర్తీ కావడంతో తక్కిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
డీఎడ్ సీటుకు లక్షన్నర!
యాజమాన్య కోటాలో ప్రైవేటు కాలేజీల వసూళ్లు ‘మెరిట్’కు పాతర.. ఇష్టారాజ్యంగా సీట్ల భర్తీ నియంత్రించలేకపోతున్న అధికారులు మేనేజ్మెంట్ కోటా ఫీజునే నిర్ధారించని విద్యాశాఖ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో ప్రైవేటు డీఎడ్ కాలేజీల యాజమాన్యాలు వసూళ్ల దందాకు దిగాయి. ఒక్కో సీటుకు రూ. లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నాయి. ఇందుకోసం మెరిట్ ప్రకారమే సీట్ల భర్తీ చేపట్టాలన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నాయి. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా.. ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. అసలు డీఎడ్ కోర్సు యాజమాన్య కోటా సీట్లకు ప్రభుత్వం కచ్చితంగా ఫీజును నిర్ధారించకపోవడం ప్రైవేటు డీఎడ్ కాలేజీ నిర్వాకానికి మరింత ఊతం ఇస్తోంది. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం రీయింబర్స్ చేస్తున్న ఫీజునే యాజమాన్య కోటా కింద వసూలు చేయాలని అధికారులు చెబుతున్నా.. కాలేజీలు మాత్రం విద్యార్థుల నుంచి అందినకాడికి దోచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని కాలేజీలైతే సీటుకు రూ. లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నాయి కూడా. డీఎడ్ కోర్సు చదివేందుకు మొగ్గు చూపుతున్న వారిలో 90 శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే. రూ. లక్షల్లో ఫీజు చెల్లించలేక వారు లబోదిబోమంటున్నారు. ఎస్జీటీ పోస్టులకు అర్హతే ఆకర్షణ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. రాష్ట్రంలో ఇంతకుముందు డీఎడ్ కోర్సుకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు.. కాలేజీల సంఖ్య కూడా తక్కువే. దాంతో అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండిపోయింది. ప్రస్తుతం విద్యాహక్కు చట్టం నేపథ్యంలో.. డీఎడ్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో చాలా మంది డీఎడ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల ఆసక్తిని ప్రైవేటు డీఎడ్ కాలేజీల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. రూ. 12,500 ఉన్న కన్వీనర్ కోటా ఫీజుకంటే పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 642 ప్రైవేటు డీఎడ్ కాలేజీలు ఉండగా వాటిలో 80 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 20 శాతాన్ని యాజమాన్య కోటాలో భర్తీచేస్తారు. డీఎడ్ కాలేజీలన్నింటిలో కలిపి దాదాపుగా 36 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి 3 లక్షల మంది వరకూ డైట్‌సెట్ రాయగా.. అందులో 2.72 లక్షల మంది అర్హత సాధించారు. దాంతో యాజమాన్య కోటాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రూ. లక్షన్నరదాకా: ప్రధాన పట్టణాల్లో ఉన్న, పేరున్న డీఎడ్ కాలేజీలు ఒక్కో సీటుకు రూ. 1.3 లక్షల వరకు వసూలు చేస్తుండగా.. ఓ మోస్తరు కాలేజీల్లోనూ రూ. 70 వేల నుంచి రూ. లక్ష దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. దాంతో యాజమాన్య కోటా భ ర్తీకి కాలేజీలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మెరిట్‌ను పక్కనబెట్టి ఎక్కువ డబ్బు చెల్లించినవారికే సీట్లను కేటాయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాజమాన్య కోటాకు ఫీజు విధానమేదీ? రాష్ట్రంలోని 25 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సీటు పొం దేందుకు.. రూ. లక్ష లోపు ఆదాయం ఉండి, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు రూ. 150 అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు. ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే రీయింబర్స్మెంట్ చేస్తుంది. రీయింబర్స్మెంట్ వర్తించని విద్యార్థులు రూ. 2,325 చెల్లించాలి. ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీటు పొందే, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థులు రూ. 1,500 అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే చాలు. రీయింబర్స్ పరిధిలోకి రాని విద్యార్థులు రూ. 12,500 అడ్మిషన్, ట్యూషన్ ఫీజుల కింద చెల్లించాలి. అయితే, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో యాజ మాన్య కోటాకు ఫీజు విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం లేదు. అటు ప్రవేశ ఫీజుల నియంత్రణ కమిటీ పరిధిలోనూ డీఎడ్ కోర్సుల ఫీజులు లేవు. దాంతో ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదనే ధైర్యంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అసలు డీఎడ్ యాజమాన్యకోటా సీటుకు కూడా రూ. 12,500 మాత్రమే ఫీజుగా వసూలు చేయాలని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా అమలుకావడం లేదు.