సాక్షి, కర్నూలు: భావి తరాలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను తీర్చిదిద్దే కోర్సులు అంగడి సరుకుగా మారిపోయాయి. డీఎడ్‌కు క్రేజ్ పెరిగిన దృష్ట్యా ప్రైవేట్ కళాశాలలు సొమ్ము చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉండటంతో.. సీటు ఖరీదును అభ్యర్థులు లెక్కచేయడం లేదు. ఇదే అదనుగా యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. జిల్లాలో 61 ప్రైవేట్, ఒక ప్రభుత్వ కళాశాలల్లో డీఎడ్‌లో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్, కళాశాలల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది మే 31న ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అభ్యర్థులు నాలుగు నెలల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అంతా సవ్యంగా సాగి ఉంటే కళాశాలలు రెండు నెలల కిందటే ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో వసతుల మాట ఎలా ఉన్నా యాజమాన్య కోటాలో సీటు దక్కించుకుందామనుకునే వారికి పలు కళాశాలలు చుక్కలు చూపుతున్నాయి.
కన్వీనర్ కోటాలో ఫీజు రూ.12,500 మాత్రమే కాగా.. యాజమాన్య కోటాలో రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల పైగా ధర పలుకుతోంది. కళాశాలలు అధికంగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో ఈ బేరం శ్రుతి మించింది. చాలా కళాశాలలు ప్రవేశాల ప్రక్రియకు ముందే ఫీజులో కొంత మొత్తం తీసుకుని సీట్లు ఖాయం చేసుకోవడం గమనార్హం. డిమాండ్‌ను అంచనా వేస్తూ.. మిగతా సీట్ల ధరను నిర్ణయిస్తుండటంతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఒక్కో ప్రైవేట్ కళాశాలలో 50 సీట్లు ఉంటే పది యాజమాన్య కోటాలో భర్తీ చేసుకునే వీలుండగా.. మిగతా వాటికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
ఏ కాలేజీకి వెళ్లినా ఇదే స్పందన
ఫలానా సార్ చెప్పారు కనుక ఓ పది వేలు తగ్గిస్తాం. అంతకన్నా ఏమీ చేయలేం.
సీటు.. హాజరు ధర వేర్వేరు. తరగతులకు రాకుంటే మాత్రం అదనంగా ఇవ్వాలి.
క్షమించండి.. సీట్లు లేవు. మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక్కటి ఖాయం చేస్తాం. మేం చెప్పిన ధరకు ఒక్క పైసా తగ్గొద్దు.
అంతగా బతిమాలుతున్నారు కాబట్టి సీటు ఇస్తాం. ధర ఎవరికీ చెప్పొద్దు. అందరికీ అదే ధరకు ఇవ్వలేం.
తప్పని తిప్పలు
అసలే కళాశాలలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో విద్యార్థులకు అందేది అత్తెసరు బోధనే అనేది సుస్పష్టం. నెలాఖరు వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగనుండడంతో కళాశాలలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. మరోవైపు జిల్లాలోని మొత్తం కళాశాలల్లో సగం ఈ ఏడాది కొత్తగా పుట్టుకొచ్చినవే. వీటిలో పూర్తిస్థాయిలో వసతులు లేనట్లు విద్యార్థులు, సంబంధీకులు గుర్తించారు. అయినా ఎలాగోలా డీఎడ్ పట్టా అందుకోవాలనే ఆశతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ నామమాత్రం కావడంతో కళాశాలల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.
పెరిగిన పోటీ
జిల్లాలో ఈ ఏడాది తెలుగు మాధ్యమంలో 28,720 మంది డైట్‌సెట్ రాశారు. 10వేల మందికి పైగా అర్హత సాధించారు. వీరంతా ర్యాంకుల ఆధారంగా జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లో ప్రవేశాలకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలామంది కన్వీనర్ కోటాలో సీటు పొందారు. మరో విడత కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యారు. తెలుగు మాధ్యమంలో ఉన్న 3,050 సీట్లలో కన్వీనర్ కోటాలో ఉండే 2,440 పోగా.. మిగతావారంతా యాజమాన్య కోటాపైనే ఆధారపడాల్సి ఉంది. ఉర్దూ మాధ్యమంలో 1,025 మంది పరీక్ష రాయగా సుమారు 200 మంది పైగా విద్యార్థులు అర్హత సాధించారు. కన్వీనర్ కోటాలోని 40 సీట్లు భర్తీ కావడంతో తక్కిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
నోటుకు సీటు డీఎడ్‌కు పెరిగిన డిమాండ్
Published Tue, Nov 26 2013 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement