
ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఆఫీసులో ఏసీబీ సోదాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆదాయం కంటే ఎక్కువ మొత్తంలో ఆస్తులు ఉన్నాయని మహబూబ్‌నగర్ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.చందూలాల్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ క్యాంపు కార్యాలయంలో దాడులు కొనసాగించారు. ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఫిర్యాదుమేరకు వారు రంగంలోకి దిగారు. ఎస్‌ఈ బి.చందులాల్ ఖమ్మం జిల్లా కొత్తగూడెం వాసి. ఆయనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో విచారణలో భాగంగా వరంగల్ రేంజ్ నుంచి వచ్చిన ఏసీబీ బృందంలో సీఐ శ్రీనివాసరాజు, మరో ఏడుగురు సిబ్బంది, స్థానిక ఏసీబీ సీఐ రమేష్‌రెడ్డితోపాటు మరో నలుగురు సిబ్బంది ఐదుగంటల పాటు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో సోదాలు చేసి కొన్ని విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్‌ఈ చందులాల్ ఎక్కడ పనిచేశారు.. ఏ జిల్లాలో ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాన్ని ఆరా తీశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈగా వచ్చి కేవలం నెలరోజులు మాత్రమే కావడంతో జిల్లాలో ఎలాంటి ఆస్తులు లేవని గుర్తించినట్లు ఏసీబీ సీఐ శ్రీనివాసరాజు మీడియాకు వెల్లడించారు. ఏకకాలంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో దాడులు కొనసాగించినట్లు వివరించారు. ఈ సోదాలో కొన్ని కోట్ల విలువైన పత్రాలతో పాటు పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణ కోసం హైదరాబాద్‌కు ఎస్‌ఈ బి.చందూలాల్‌ను ఏసీబీ అధికారులు తీసుకువెళ్లారు.అలాగే, చందూలాల్ స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం చుంచుపల్లిలోని ఇంటితోపాటు సీతంపేటలోని బంధువుల ఇళ్లపై ఏక కాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. కొత్తగూడెంలో చందులాల్‌కు చెందిన మూడంతస్తుల భవనం, ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమితోపాటు పలు దస్త్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాయిబాబు మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో రూ.12 నుంచి రూ.13 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు.
కరీంనగర్‌లోనూ తనిఖీలు..
కరీంనగర్ క్రైం : ఎస్‌ఈ చందులాల్ ఆక్రమాస్తులపై ఏసీబీ తనిఖీల్లో భాగంగా కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి రోడ్ నంబర్ 2లోని కైలాస్ రెసిడెన్సీలో ఉన్న 305, 306 ఫ్లాట్లలో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో బృందం తనిఖీలు చేపట్టింది. గతంలో జిల్లాలో సుదీర్ఘకాలం పని చేసిన చందులాల్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలున్నాయి. కరీంనగర్‌లోని అతని బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అర కేజీ బంగారం, ఒక కేజీ వెండి, రూ.3.80 లక్షల నగదు, వరంగల్ జిల్లాలో 6 ఓపెన్ ప్లాట్లు, రెండు జీప్లస్ 2 ఇళ్లు, హన్మకొండలో ఒక ఇళ్లు, హైదరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పత్రాలు, ఒక డస్టర్, ఒక క్రేటా కార్ కరీంనగర్‌లో గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుం దని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.