అభివృద్ధి వేగవంతం చేయండి
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవార రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపాలీటీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూం పథకం కింద గ్రామాల్లో, పట్టణాల్లో భూములను గుర్తించి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని తెలిపారు. జీ ప్లస్ టు ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం ద్వారా పూర్తి చేస్తామని అన్నారు.
పశువుల కోసం షెడ్ల నిర్మాణాలు చేపట్టాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా జీప్లస్ టు ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేయాలని పేర్కొన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున కేఆర్‌కే కాలనీ, ఖండాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో 11 ట్రాక్టర్‌ల ద్వారా తాగునీరు ప్రజలకు అందిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మంగతాయారు తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ ఆధీనంలో ఉన్న భూములలో స్మృతి వనం, చిన్నపిల్లల పార్కు ఏర్పాటు చేయాలని కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ సూచించారు. ఈ సమావేశంలో జేసీ కృష్ణారెడ్డి, ఆర్‌డీఓ సూర్యనారాయణ, పంచాయతీరాజ్ ఈఈ మారుతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మూర్తి, ఎస్సీ సంక్షేమ అధికారి కిషన్, కార్పోరేషన్ ఈడీ శంకర్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.