మంటలు రేపిన ప్రమాదం
తాడేపల్లిగూడెం రూరల్ : ఐషర్ వ్యాన్‌ను మారుతీ ఆల్టో కారు ఢీకొన్న ఘటన గురువారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం నవాబ్‌పాలెం కొత్త వంతెనపై జరిగింది. ఈ ఘటనలో రెండు వాహనాలు దగ్ధమవగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీ 05, 7381 నంబర్ మారుతీ కారు రాజమహేంద్రవరం నుంచి చెన్నై వెళ్తున్న ఐషర్ వ్యాన్ ఇంధన ట్యాంకర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా రెండు వాహనాల నుంచి మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన వ్యాన్ డ్రైవర్ దిగిపోగా, కారులో ఉన్న ఇద్దరూ పొగ కారణంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆటోడ్రైవర్ కారు అద్దాలు పగులకొట్టి డోరు తీసి వారిని కాపాడారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఒక మహిళ, కారు యజమాని ఉన్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత కారుకు మంటలు వ్యాపించి వాహనం దగ్ధమైంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.