ఆ దుర్ఘటన కళ్లముందే మెదులుతోంది
Published Tue, Aug 23 2016 11:29 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
తణుకు : ‘బస్సు వేగంగా వెళుతోంది.. అర్ధరాత్రి.. అందరం గాఢ నిద్రలో ఉన్నాం.. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ పెద్ద శబ్దం.. ఒక్కసారిగా కుదుపు.. కళ్లు తెరిచి చూస్తే నీళ్లల్లో ఉన్నాం.. చుట్టూ హాహాకారాలు.. ఇంతలో కొందరు యువకులు వచ్చి బస్సు అద్దాలు పగలగొట్టి మమ్మల్ని బయటకు తీశారు.. అప్పుడు తెలిసింది మేం ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైందని’. ఇదీ ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడినlతణుకు మండలం పైడిపర్రుకు చెందిన గొర్రె లక్ష్మి, నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామానికి చెందిన తోట నాగమణిల మనోగతం. వీరిని సోమవారం అర్ధరాత్రి తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిద్దరికీ ఛాతీ, నడుంభాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో సొంత జిల్లాలోనే చికిత్స అందజేయాలనే ఉద్దేశంతో వీరిని ప్రత్యేక అంబులెన్సులో ఖమ్మం నుంచి తణుకు తరలించారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నారు. ఇప్పటికీ ఘోర దుర్ఘటన దృశ్యాలు తమ కళ్లముందే కదలాడుతున్నాయని వారు కన్నీటిపర్యంతమయ్యారు.
కూతురి వెంట వెళ్లి.. తిరుగు ప్రయాణంలో..
నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామానికి చెందిన తోట నాగమణి కూతురు, అల్లుడు హైదరాబాదులో ఉంటున్నారు. ఈనెల 19న కుమార్తె ఆకుల పుణ్యసాయి హైదబాద్ వెళ్తూ తనతోపాటు నాగమణిని తీసుకెళ్లారు. సోమవారం తిరుగు ప్రయాణంలో షాపూర్ వద్ద నాగమణిని కూతురు, అల్లుడు బస్సుక్కించారు. సాధారణంగా రైలు ప్రయాణం చేసే నాగమణి పుష్కరాలు, పెళ్లి ముహూర్తాల వల్ల రైళ్లు ఖాళీ లేకపోవడంతో చివరి నిమిషంలో బస్సు ప్రయాణం ఎంచుకున్నారు. తనతోపాటు నిడర్రుకు చెందిన బంధువు వానపల్లి పెద్దిరాజు అదే బస్సులో ఉండటంతో తోడుగా ఉంటారని ఆ బస్సు ఎక్కారు. డ్రైవర్ వెనుక రెండో సీట్లో కూర్చున్న నాగమణి వెనుక సీట్లో పెద్దిరాజు కూర్చున్నారు. ఈ ప్రమాదంలో పెద్దిరాజు మృతి చెందడంతో నాగమణి తీవ్రంగా గాయపడ్డారు.
కుమారుడి వద్దకు వెళ్లి వస్తూ..
తణుకు మండలం పైడిపర్రు ప్రాంతంలో నివాసం ఉంటున్న గొర్రె లక్ష్మి కుమారుడు రాజు హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. కొన్ని రోజులు కుమారుడు వద్ద ఉండి వద్దామని దాదాపు నెల రోజుల క్రితం లక్ష్మి హైదరాబాద్ వెళ్లారు. సోమవారం రాత్రి మియాపూర్ వద్ద కుమారుడు రాజు ఆమెను బస్సు ఎక్కించారు. నాగమణి సీటు పక్కనే లక్ష్మి కూర్చున్నారు. వీరిద్దరూ కూర్చున్న సీటుకు ముందున్న రాడ్ వీరిద్దరికీ రక్షణగా ఉండటంతో వీరి ప్రాణాలు దక్కాయి. అయితే సీటు భాగం నొక్కేయడంతో ఛాతీ, నడుం భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.
Advertisement