2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
Published Thu, Jul 21 2016 8:13 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
రామన్నపేట : ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపా«ధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల కేంద్రంలో రామన్నపేట, చిట్యాల మండలాలకు చెందిన భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాజెక్ట్‌ల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతోందన్నారు. బలవంతంగా రైతుల నుంచి భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల్లో చీలిక తెచ్చే విధంగా ప్రభుత్వం మధ్య దళారులను రంగంలోకి దించిందని ఆరోపించారు. రీడిజైన్లపేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలకులు రైతుల నోట్లో మట్టికొట్టే విధంగా వ్యవహరించడం తగదని అన్నారు. మేక అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండ శ్రీశైలం, ఎం.డి జహంగీర్, జెల్లెల పెంటయ్య, కత్తుల లింగస్వామి, జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, కూరెళ్ల నర్సింహాచారి, అరూరి శ్రీనివాస్, గన్నెబోయిన విజయభాస్కర్, గాదె నరేందర్, ఎడ్ల మోహన్‌రెడ్డి, అంబటి మల్లారెడ్డి, పోచబోయిన స్వామి, మల్లేశం, ఏబూషి నర్సింహ, సుర్కంటి మోహన్‌రెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం, బూరుగు లింగస్వామి పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్ని పట్టించుకోని సర్కారు...
చిట్యాల : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నాయని మల్లారెడ్డి విమర్శించారు. చిట్యాలలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను వ్యవసాయ రంగంలోకి ఆహ్వానిస్తూ కరీంనగర్‌లో లక్ష ఎకరాల భూములను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు. దీంతో రాష్ట్రంలోని చిన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి బండ శ్రీశైలం, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు అవిశెట్టి శంకరయ్య, కేవీపీఎస్ డివిజన్ అధ్యక్షుడు జిట్ట నగేశ్, నాయకులు రాజయ్య, పెద్దులు, లింగయ్య, భిక్షం పాల్గొన్నారు.
Advertisement