సినీ ఫక్కీలో నిందితుడిని పట్టుకున్న యువకులు
సినీ ఫక్కీలో నిందితుడిని పట్టుకున్న యువకులు
Published Mon, Sep 12 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
మహిళ మెడలో చైన్ స్నాచింగ్
మంగళగిరి : మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితుడిని సినీ ఫక్కీలో పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన ఆదివారం పట్టణంలో చోటుచేసుకుంది. పాతమంగళగిరి బిట్రావారివీధికి చెందిన మునగాల లక్ష్మీనర్సమ్మ మధ్యాహ్నం తన సోదరుని ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని దుండగుడు ద్విచక్రవాహనంపై వచ్చి లక్ష్మీనర్సమ్మ మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. బాధితురాలి అరుపులతో చేరుకున్న స్థానికులు దుండగుడిని వెంబడించారు. నలుగురు యువకులు తమ ద్విచక్రవాహనాలపై బాధితురాలిని ఎక్కించుకుని వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆంజనేయకాలనీలో నుంచి వేగంగా నిందితుడు వెళుతున్న ద్విచక్రవాహనం జాతీయరహదారిపైకి వెళ్లే సమయంలో వార్డు మాజీ కౌన్సిలర్ వంగర పెదలక్ష్మయ్యను ఢీకొట్టాడు. సమీపంలోని వారంతా ఒక్కసారిగా అప్రమత్తమై వాహనంపై ఉన్న యువకుడిని అడ్డుకోవడంతో వెంబడిస్తున్న బాధితురాలు, యువకులు చేరుకుని చైన్ లాగింది అతడేనని గుర్తించింది. చొక్కా జేబులు వెతకగా జేబులో గొలుసు దొరికింది. దీంతో ఆగ్రహించిన యువకులు దొంగకి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని రక్షక్ వాహనం ఎక్కించారు. ఇంతలో నిందితుడు సెల్‌ఫోన్ మోగింది. పోలీసులు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అవతల నుంచి మాట్లాడేది ఎవరో విన్నారు. అవతలి నుంచి మేమిద్దరం పెదవడ్లపూడి సెంటర్‌లో ఉన్నాము..పని అయిందిగా త్వరగా వచ్చేయి అంటూ సమాధానం వచ్చింది. వెంటనే పోలీసులు పెదవడ్లపూడి సెంటర్‌కు చేరుకుని మిగిలిన నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడింది మంగళగిరి పట్టణానికి చెందిన రవిగా పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు తోట సాయి, సుధాకర్ అని చెప్పారు. వీరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు లక్ష్మీనర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement