అచ్చెన్న అబద్ధాలు | achenna lies | Sakshi
Sakshi News home page

అచ్చెన్న అబద్ధాలు

Published Sat, Apr 1 2017 11:56 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

అచ్చెన్న అబద్ధాలు - Sakshi

అచ్చెన్న అబద్ధాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు : మొగల్తూరులో ఐదుగురు యువకుల్ని పొట్టనపెట్టుకున్న ఆనంద ఆక్వా గ్రూప్‌ సంస్థలపై ప్రభుత్వం అమిత ప్రేమ చూపిస్తోంది. మొగల్తూరు ఘటనపై శుక్రవారం శాసనసభలో చర్చ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు పలికారు. ఆక్వా ప్లాంట్‌కు సంబంధించిన పైపులైన్లు తొలగించినట్టు మంత్రి ప్రకటించారు. శనివారం కూడా ఆ ఫ్యాక్టరీ పైపులైన్లు అలానే ఉండటం గమనార్హం. ఐదుగురి మరణానికి కారణమైన ప్లాంట్‌ నుంచి వచ్చే వ్యర్థ జలాలను ప్రాసెస్‌ చేసేందుకని చెబుతున్న సంప్‌ (ట్యాంక్‌) నిర్మించి రెండు నెలలు కూడా కాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ సంప్‌లోకి వచ్చే వ్యర్థాలను, కాలుష్యంతో కూడిన జలాలను పైప్‌లైన్‌ ద్వారా నేరుగా గొంతేరు కాలువలో కలుపుతున్నారు. ప్లాంట్‌ నిర్మించిన నాటినుంచి దానినుంచి వచ్చే వ్యర్థాలను గొంతేరులోకి తరలిసూ్తనే ఉన్నారు. తుందుర్రులో ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు తీవ్రం కావడం, మొగల్తూరులోని ప్లాంట్‌ అదే యాజ మాన్యానికి చెందినది కావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు 2016 పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొంతేరు డ్రెయిన్‌లోకి వేసిన పైప్‌లైన్లను తక్షణం తొలగించాలని, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి వ్యర్థాలను, కాలుష్యాన్ని శుద్ధి చేయాలని ఆదేశించింది. ఆ నీటిని అదే ప్లాంట్‌లో పంటల కో సం వినియోగించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత తుందుర్రు ఆక్వా పరిశ్రమకు సంబంధించి ప్రజలు చెబుతున్న విషయాల్లో ఏ మేరకు నిజం ఉందో తెలుసుకునేందుకగత ఏడాది డిసెంబర్‌లో అప్పటి సబ్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మొగల్తూరు ఆక్వా ప్లాంట్‌ను తనిఖీ చేయడంతో అసలు బండారం బయటపడింది. అప్పటివరకు రొయ్యలను శుద్ధి చేసిన రసాయనాలను నేరుగా గొంతేరు డ్రెయిన్‌లోకి వదిలేవారు. సబ్‌ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, రసాయనాలను శుద్ధిచేసే ట్యాంక్‌ను నిర్మించారు. అయితే, వాటిని ఇప్పటికీ వినియోగించడం లేదు. ఫ్యాక్టరీ పక్కనే రెండు చేపల చెరువులు తవ్వి, దాని పక్కనే ఒక గట్టుపై ఐదుగురి మరణానికి కారణమైన సంప్‌ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రైతుల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలను ముందుగా శుభ్రంచేసి, అనంతరం వాటి తలలను తొలగించి ప్రాసెసింగ్‌ ప్లాంట్స్‌కు పంపించాలి. రొయ్యల తలలు తొలగించే సయమంలో కొంత పసుపు, తెలుపు రంగులో ఉండే జిగురు లాంటి వ్యర్థం బయటకు వస్తుంది. దానిని ఎఫిలెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఈటీపీ)లోకి పంపించాలి. ఈపీటీకి ఐరన్‌ గ్రిల్‌ వేసి దీనిని ప్రతిరోజు బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలి. సంపునే ఈటీపీగా చూపిస్తున్న యాజమాన్యం దానిని రేకులతో పూర్తిగా మూసివేసింది. దీనివల్ల ఈపీటీలో నిల్వ వున్న వ్యర్థాలు కుళ్లిపోయి మీథేన్‌ గ్యాస్‌గా మారుతోంది. 
 
నిపుణులు ఏరీ
ఈటీపీని శుభ్రం చేయడానికి నైపుణ్యం, అనుభవం గల సిబ్బం దిని వినియోగించాల్సి ఉంటుంది. యాజమాన్యం అందుకు భిన్నంగా అవగాహన లేని దినసరి కూలీలను సంప్‌లోకి దింపింది. అందులోంచి విషవాయువులు వెలువడటంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇదిలావుంటే.. ఈటీపీగా చెబుతున్న సంపులోని కలుషిత జలాలను పైప్‌లై¯ŒS ద్వారా నేరుగా గొంతేరులోకే వదిలిపెడుతున్నారు. కూలీల మరణించిన రోజున ప్లాంట్‌కు వెళ్లిన కలెక్టర్‌ కె.భాస్కర్‌కు స్థానికులు గొంతేరులోకి వేసిన పైప్‌లైన్లను చూపించారు. వాస్తవాలు ఇలా ఉంటే కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్లాంట్‌లోని పైప్‌లైన్లను తొలగించినట్టు అసెంబ్లీలో శుక్రవారం ప్రకటన చేశారు. ఈ ప్లాంట్‌ కట్టకముందు గొంతేరులో పీతలు పెద్దఎత్తున ఉండేవని, చేపల సంఖ్య కూడా గణనీయంగా ఉండేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఆనంద ఆక్వా ప్లాంట్‌ కారణంగా అవి అంతరించిపోవడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని వాపోతున్నారు.
 
కాలుష్యం ఇక్కడ మామూలే
కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఒకసారి భీమవరం వస్తే అన్నీ చూడవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. యనమదుర్రు డ్రెయిన్‌లో కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పాలకోడేరు మండలంలోని పరిశ్రమలు, రొయ్యల ఫ్యాక్టరీలు విడుదల చేస్తున్న విష వ్యర్థాలు, కలుషితమైన నీరు ప్రధాన కాలువలు, డ్రెయిన్లలోకి చేరుతూ వాటిని కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. యనమదుర్రును కాలుష్య కాసారంగా మార్చేసిన వేండ్ర డెల్టా పేపర్‌ మిల్‌ ప్రస్తుతం నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అధీనంలో ఉంది. ప్రజాప్రతినిధులకు భయపడి కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. గొల్లలకోడేరులో ఖాదర్‌ రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలన్నీ యనమదుర్రులోకి చేరుతున్నాయి. మోగల్లులోని వశిష్ట రొయ్యల ఫ్యాక్టరీ, పాలకోడేరులోని ఆనంద రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు గోస్తనీ కాలువ ద్వారా యనమదుర్రు డ్రెయిన్‌లో కలుస్తున్నాయి. సమస్య తీవ్రంగా ఉన్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు ఈ కలుషిత నీటినే వాడాల్సి వస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement