
‘కాకతీయుడు’తో జతకట్టా..
సినీనటి, మిస్ విజయవాడ రేవతీ చౌదరి
ఏలూరు (కామవరపుకోట) : తారకరత్న సరసన తాను నటించిన ‘కాకతీయుడు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వర్ధమాన సినీనటి, ’మిస్ విజయవాడ’ రేవతీ చౌదరి తెలిపారు. మండలంలోని తూర్పు యడవల్లిలో గురువారం రాత్రి జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. తనది విజయవాడ అని, ’మిస్ విజయవాడ’ టైటిల్ గెలుచుకున్న అనంతరం సినిమాల్లో అవకాశాలొస్తున్నాయన్నారు.
శివాజీ హీరోగా నటించిన సినిమాలో మొదటిసారిగా తెరంగేట్రం చేశానని, అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాలేదని చెప్పారు. తారకరత్నతో నటించిన ‘కాకతీయుడు’ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నారు. తన అభిమాన నటుడు బాలకృష్ణ, అభిమాన నాయకి శ్రీదేవి అని చెప్పారు. జగదేకవీరుడు-అతిలోక సుందరి సినిమాలో శ్రీ దేవి ధరించిన దేవకన్యలాంటి పాత్ర చేయాలని ఆశగా ఉందని తెలిపారు. ప్రస్తుతం సముద్ర దర్శకత్వంలో ఓ మరో చిత్రంతో పాటు, తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నట్టు చెప్పారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే చిత్రసీమలోకి అడుగుపెట్టినట్టు తెలిపారు.