నీటి ఎద్దడి నివారణకు చర్యలు
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కొత్తపల్లి (పత్తికొండ రూరల్): రానున్న వేసవిలో కర్నూలు నగరంలో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పందికోన రిజర్వాయర్ వద్ద ఎడమకాలువ నుంచి గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. పందికోన రిజర్వాయర్‌కు 400 క్యూసెక్కుల నీటిని హంద్రీ–నీవా కాలువ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. ఇందులో 200 క్యూసెక్కుల నీటిని గాజుల దిన్నె ప్రాజెక్టుకు సరఫరా చేస్తామని చెపా్పరు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అనంతరం కొత్తపల్లి గ్రామరైతులు కలెక్టర్‌ను కలిసి పందికోన రిజర్వాయర్ నుంచి వస్తున్న ఊట నీరుతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఇక్కడ కాలువలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటిని మళ్లించాలని కోరారు.కలెక్టర్ వెంట పత్తికొండ తహసీల్దారు పుల్లయ్య, పంట కాలువల డీఈ గుణాకర్‌రెడ్డి, ఏఈలు, జేఈలు త్రినాథ్‌రెడ్డి, పురుషోత్తం, సాగునీటి ప్రాజెక్టు అధికారులు, ఆర్‌ఐ ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.