బోగస్ ఓటర్ల తొలగింపునకు చర్యలు
బోగస్ ఓటర్ల తొలగింపునకు చర్యలు
Published Tue, Feb 14 2017 11:28 PM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో బోగస్ ఓటర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. బుధవారం కలెక్టర్ తన సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులయిన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ మానిటరింగ్ సెల్(08518–277305, 277309)కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు.
నామినేషన్‌ల ఘట్టం సోమవారం నుంచి ప్రారంభమైందని ఈ నెల 20వ వరకు నామినేషన్‌లకు అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటర్లు 6945 ఉండగా ఇది వరకు 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, తాజాగా 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పట్టభద్రుల ఓటర్లు 84750 ఉండగా ఇది వరకు 112 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా తాజాగా 121 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు గరిష్టంగా 1400 ఓటర్లు ఉండవచ్చని అయితే జిల్లాలో 1300 మాత్రమే ఉన్నారని అయితే సమయం సరిపోదని చెబుతున్నందున 1000 మందికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసే విధంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా నగరంలో వైఎస్‌ఆర్ సీపీ ఫ్లెక్సీలను కార్యక్రమం ముగిసిన వెంటనే మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారని, అదే తెలుగుదేశం ఫ్లెక్సీలను నెలల తరబడి ఉంచుతున్నారని ఇదెక్కడి న్యామంటూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి సమావేశం దృష్టికి తెచ్చారు.
2000భోగస్‌ఓటర్లను గుర్తించి ఆధారాలతో సహా అధికారులకు ఇచ్చామని వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఎం ప్రతినిధి గౌస్ దేశాయ్ కోరారు. సమావేశంలో అసిస్టెంటు రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, టీడీపీ ప్రతినిధి సత్రం రామకృష్ణుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుదర్శన్‌రెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి రసూల్, సమాజ్‌వాదీ పార్టీ నేత దండు శేషుయాదవ్ పాల్గొన్నారు.
Advertisement