క్రమబద్ధీకరించుకోకుంటే చర్యలు
– టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ వెంకటపతి రెడ్డి
కర్నూలు(టౌన్): ప్రభుత్వ అనుమతి లేని భవనాలను ఈ నెలాఖరు లోపు క్రమబద్ధీకరించుకోకపోతే చర్యలు తప్పవని పట్టణ ప్రణాళిక విభాగం ప్రాంతీయ సంచాలకులు వెంకటపతిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నగరపాలక సంస్థలోని కమిషనర్ చాంబర్‌లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల అనుమతులకు సంబంధించి ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో కంప్యూటీకరించాలన్నారు. ఆన్‌లైన్ విధానంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే భవనాల క్రమబద్ధీకరణ పథకం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, కంప్యూటరీకరణ చేశారా, ఎన్ని దరఖాస్తులను క్లియర్ చేశారు తదితర వివరాలను సంబంధిత పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిత గతిన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, పట్టణ ప్రణాళిక విభాగం అడిషనల్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం, టీపీఎస్‌లో బీఐలు పాల్గొన్నారు.