legalize
-
క్రిప్టోకు చట్టబద్ధత వచ్చినట్లు కాదు
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను రిటర్ను ఫారంలలో ప్రత్యేకంగా ఉంటుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. క్రిప్టో ఆదాయాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ‘ఈ కరెన్సీలకు సంబంధించిన ట్యాక్సేషన్‌పై స్పష్టత తెచ్చేందుకే ఫైనాన్స్ బిల్లులో వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై పన్నుల నిబంధన చేర్చారు. ఈ నిబంధనల్లో వీటి చట్టబద్ధత గురించి ఏమీ లేదు. క్రిప్టోకరెన్సీల నియంత్రణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయి‘ అని బజాజ్ తెలిపారు. ‘క్రిప్టో అసెట్స్ ఆదాయంపై పన్ను విధించే విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. అందుకే గరిష్టంగా 30 శాతం రేటు పరిధిలోకి దాన్ని చేర్చాం. టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తింపచేస్తున్నాం. ఇకపై ఈ లావాదేవీలన్నింటినీ ట్రాక్ చేస్తాం‘ అని ఆయన వివరించారు. క్రిప్టోల చట్టబద్ధత గురించి ప్రస్తావించకుండా.. గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ లావాదేవీల తరహాలోనే ఈ కరెన్సీల ద్వారా వచ్చే లాభాలపైనా 30% పన్ను (సెస్సు, సర్‌చార్జీలు అదనం) విధించాలని బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి పన్ను, జులై 1 నుంచి టీడీఎస్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కూడా క్రిప్టో లాభాలపై పన్ను వర్తిస్తుందని, 2022 ఏప్రిల్ 1కి ముందు చేసిన క్రిప్టో లావాదేవీలను ఐటీఆర్‌లోని ఏదో ఒక హెడ్ కింద చూపితే అసెస్మెంట్ అధికారి దానిపై తగు నిర్ణయం తీసుకుంటారని బజాజ్ తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్లకు టెక్నాలజీ తప్ప ఎటువంటి ఆర్థిక విలువ ఉండదు కాబట్టి డిడక్షన్లకు తావు ఉండదని ఆయన చెప్పారు. పన్నుతో మార్కెట్ పరిస్థితి తెలుస్తుంది: సీబీడీటీ చీఫ్ మహాపాత్ర క్రిప్టో కరెన్సీలపై పన్నుల వడ్డనతో దేశీయంగా ఈ మార్కెట్ ’లోతు’ ఎంత ఉందో తెలుస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర చెప్పారు. అలాగే ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల స్వభావం మొదలైన వివరాల గురించి కూడా వెల్లడవుతుందని పేర్కొన్నారు. అయితే పన్ను విధించడమనేది.. ఈ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే డిజిటల్ వ్యాపారం ద్వారా లాభాలు ప్రకటించిన పక్షంలో.. దానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడ నుంచి తెచ్చారన్నది కూడా వెల్లడించాల్సి ఉంటుందని మహాపాత్ర తెలిపారు. ఒకవేళ పెట్టుబడి సరైనదే అయితే లాభాలపై పన్ను వర్తిస్తుందని చెప్పారు. అలా కాకుండా లెక్కల్లో చూపని డబ్బును లేదా బినామీగా ఇన్వెస్ట్ చేసినట్లు తేలితే దానికి అనుగుణంగా ఇతర చర్యలు ఉంటాయన్నారు. ట్యాక్సేషన్ వల్ల ఇవన్నీ బైటపడతాయని మహాపాత్ర చెప్పారు. అనధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి చూస్తే దేశీయంగా క్రిప్టో లావాదేవీల పరిమాణం ఏటా రూ. 30,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకూ ఉంటోంది. -
నరకయాతన లేని చావు.. తిట్టిపోస్తున్న జనం!
Suicide Pods Are Now Legal In Switzerland: హిట్లర్.. నాజీ సైన్యం తమ శత్రువులను గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేదని, పారిపోయేందుకు ప్రయత్నించే వాళ్లను కిమ్ జోంగ్ ఉన్ గ్యాస్ ఛాంబర్లో తోసేసి శిక్షించేవాడని కథనాలు చదివాం కదా. ఇది అందుకు ఏమాత్రం తీసిపోని విషయం. అందుకే జనాలకు అంతలా తిట్టిపోస్తున్నారు. ‘చావుపుట్టుకలు మన చేతుల్లో ఉండేవి కావు’.. ఇది ఎప్పటికీ అక్షర సత్యం. కానీ, చావును సైతం చెప్పుచేతుల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది?. ప్రత్యేక చట్టాలు అనుమతితో కారుణ్య మరణాలు కొనసాగుతున్న వేళ.. విమర్శలెన్ని వినిపించినా ‘తగ్గేదే లే’ అంటున్నాయి కొన్ని దేశాలు. తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. నొప్పి లేకుండా కేవలం నిమిషాల్లో.. అదీ ప్రశాంతంగా చనిపోవచ్చంటూ ప్రత్యేక క్యాప్సూల్స్ వాడకానికి అనుమతులు ఇచ్చింది స్విస్ ప్రభుత్వం. సార్కో క్యాప్సూల్‌గా పిలిచే ఈ పేటికలను లోపల పడుకునే వ్యక్తే ఆపరేట్ చేసుకోగలగడం, ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్లడమే అసలు ప్రత్యేకతలు. ఈ ప్యాడ్‌లో పడుకున్న వ్యక్తిని ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత యాక్టివ్ బటన్‌ను నొక్కేందుకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తారు. బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు రిలీజ్ అవుతుంది. కేవలం 30 సెకన్లలో ఆక్సిజన్ లెవల్ 21 శాతం నుంచి 1 శాతానికి పడిపోతుంది. స్పృహ కోల్పోయిన వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే ప్రాణం విడుస్తాడు. ఈ ప్రాసెస్‌లో కణజాలానికి తక్కువ ఆక్సిజన్ పంపిణీ (hypoxia) రక్తంలో కార్బన్ డై యాక్సైడ్ లెవల్ తక్కువ కావడం(hypocapnia) ద్వారా మరణం సంభవిస్తుంది. క్యాబిన్లో ఉన్న వ్యక్తి స్పృహలోకి జారుకునే క్రమంలో.. కంటి చూపు తప్ప శరీర కదలికలు పని చేయవు. తద్వారా ప్రాణం పోయేటప్పుడు గిలగిలలాడేందుకు వీలు కూడా ఉండదు అంటున్నారు డాక్టర్ ఫిలిప్ నిట్స్‌చెకే. ఆస్ట్రేలియాకు చెందిన ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్) డైరెక్టర్, డాక్టర్ డెత్‌గా పేరున్న ఫిలిప్ నిట్స్‌చెకే ఈ క్యాప్సుల్‌ను రూపొందించాడు. చట్టబద్ధత ఉంది! అసిస్టెడ్ సూసైడ్‌కు స్విట్జర్లాండ్‌లోనూ చట్టబద్దత ఉంది. కిందటి ఏడాది 1,300 మంది ఇలా చనిపోయారు కూడా(ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు). అదీ లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చనిపోయేలా చేసేవాళ్లు. ఇక ఇప్పుడు సార్కో క్యాప్సూల్స్ ద్వారా అనుమతి ఇచ్చారు. అయితే ఈ అనుమతి ఆత్మహత్యలకు వుసిగొల్పేలా ఉందంటూ ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ స్విస్ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. ఇక ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఇప్పటికే రెండు మోడల్స్ సార్కో లను తయారు చేసింది. ఇప్పుడు రూపొందించింది త్రీడీ ప్రింట్ టైప్. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ఇది స్విస్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఆర్టికల్ కేవలం సమాచారం అందించే ఉద్దేశంతో రాయబడింది -
ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదు
లక్నో: దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, రైతులతో చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ కోరారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు ఒక్కటే కాదు, ఇంకెన్నో అంశాలు ఉన్నాయని, వాటిపై కేంద్రం చర్చలకు వచ్చేదాకా అన్నదాతల పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందని, తమతో మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) చట్టబద్ధత, విత్తనాలు, పాడి పరిశ్రమ, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌కు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మద్దతు పలికారని తికాయత్ గుర్తుచేశారు. ఇదే డిమాండ్‌ను తాము లేవనెత్తుతున్నామని, ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ఉగ్రవాదితో సరిపోల్చారు. లఖీమ్‌పూర్ ఖేరిలో రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు హాని చేస్తాయన్న నిజాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని ప్రకటించిందని, సరైన నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాల గురించి కొందరికి అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామంటూ రైతుల నడుమ చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ కొందరు తామేనని అన్నారు. ప్రజలను మభ్యపెడుతూ దేశాన్ని అమ్మేస్తుంటారు సంఘర్‡్ష విశ్రామ్(కాల్పుల విరమణ)ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందని, రైతులు కాదని రాకేశ్ తికాయత్ ఉద్ఘాటించారు. పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయని, అప్పటిదాకా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. దేశమంతటా సభలు, సమావేశాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ వ్యవహార ధోరణిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. రైతుల పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘వారు (ప్రభుత్వం) ఒకవైపు మిమ్మల్ని హిందూ–ముస్లిం, హిందూ–సిక్కు, జిన్నా అంటూ మభ్య పెడుతుంటారు. మరోవైపు దేశాన్ని అమ్మేస్తుంటారు’’ అని తికాయత్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి క్షమాపణ చెప్పినంత మాత్రాన పంటలకు కనీస మద్దతు ధర దక్కదని అన్నారు. చట్టబద్ధత కల్పిస్తేనే దక్కుతుందని చెప్పారు. ఈ అంశంపై ఒప్పటికే కమిటీని ఏర్పాటు చేశారని, నివేదిక ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) చేరిందని, నిర్ణయం తీసుకోవడానికి కొత్త కమిటీ అవసరం లేదని సూచించారు. నివేదిక ఇచ్చిన కమిటీలో నరేంద్ర మోదీ కూడా సభ్యుడేనని గుర్తుచేశారు. కమిటీ సిఫార్సులను ఆయన ఆమోదిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించరేం? ప్రసార మాధ్యమాల తీరుపై రాకేశ్ తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా మీడియా కేవలం రైతులను మాత్ర మే ప్రశ్నిస్తోందని ఆక్షేపించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో 750 మందికిపైగా రైతులు మరణించారని తెలిపారు. కిసాన్ మహా పంచాయత్‌లో పలువరు రైతు సంఘాల నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
బంతి సుప్రీంకోర్టులో..
న్యూఢిల్లీ: వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న నిబంధన రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టే తేల్చాలని కేంద్రం పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377లోని ఈ ఒక్క అంశంపైనే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, దత్తతలు, హక్కులు తదితరాల జోలికిపోవొద్దని కోరింది. ఇందుకు సంబంధించి కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరమని పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి చేపట్టిన సంగతి తెలిసిందే. సెక్షన్ 377 పరిధి దాటి మరేదైనా విషయాన్ని కోర్టు పరిశీలించదలచుకుంటే, దాని ప్రభావం ఇతర చట్టాలపై తప్పక ఉంటుందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ‘వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 377పై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విచక్షణకే వదిలేస్తోంది. సెక్షన్ 377 పరిధి దాటి ఇతర విషయాల్ని కోర్టు పరిశీలించదలచుకున్నా, ఎల్జీబీటీ వర్గాల హక్కులకు సంబంధించి ఏదైనా తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నా, బదులుగా మరో సవివర అఫిడవిట్ దాఖలు చేస్తాం’ అని కేంద్రం తెలిపింది. అదో ఏవగింపు చట్టం.. ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒకవేళ తాము అందులోని శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గంపై ఉన్న అనర్హత తొలగిపోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడంతో పాటు ఎన్నికల్లో పోటీచేస్తారని ధర్మాసనం తెలిపింది. ఇదే జరిగితే అలాంటి సంబంధాలను సమాజంలో హీనంగా చూసే రోజులు పోతాయంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఇలాంటి చట్టం ‘సామాజిక ఏవగింపు’నకు ఉదాహరణ అని పేర్కొంది. ఇలాంటి వాటిని చెల్లవని ప్రకటించడం సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఎల్జీబీటీ వర్గీయులు గౌరవంగా జీవించేందుకు సాయపడుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్వలింగ సంపర్కుల ఉపాధికి ఈ చట్టంలోని శిక్షార్హమైన నిబంధనలు తీవ్ర విఘాతంగా మారాయని తెలిపింది. అయినా, స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అన్నదానిపైనే విచారణ జరుపుతామని, ఎల్జీబీటీ హక్కుల అంశం తమ ముందుకు రాలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 377ను సవాలు చేస్తూనే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయని కేంద్రం తెలపింది. ఆ పరిధిని దాటి విచారణ కోర్టు జరపాలనుకుంటే చట్టబద్ధ దేశ ప్రయోజనాలను ఉటంకిస్తూ కౌంటర్ అఫిడవిట్ వేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేసే అవకాశం ఇవ్వకుండా, సెక్షన్ 377 కాకుండా ఇతర విషయాలపై విచారణ జరిపి, తీర్పు వెలువరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. వివాదం లేకుంటే విచారణ వద్దు.. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ..వివాదంలో లేని వ్యవహారాలపై విచారణ అక్కర్లేదని అన్నారు. తొలిరోజు విచారణ సందర్భంగా..‘జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రాథమిక హక్కు’ అన్న జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అందుకు జస్టిస్ చంద్రచూడ్ బదులిస్తూ సంక్లిష్ట విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, ఇద్దరు వయోజనుల మధ్య సంబంధం ఆర్టికల్ 21కి సంబంధించిందా? కాదా? అనే విషయంపైనే దృష్టిపెడుతున్నామని స్పష్టతనిచ్చారు. -
క్రమబద్ధీకరించుకోకుంటే చర్యలు
– టౌన్ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్ వెంకటపతి రెడ్డి కర్నూలు(టౌన్): ప్రభుత్వ అనుమతి లేని భవనాలను ఈ నెలాఖరు లోపు క్రమబద్ధీకరించుకోకపోతే చర్యలు తప్పవని పట్టణ ప్రణాళిక విభాగం ప్రాంతీయ సంచాలకులు వెంకటపతిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నగరపాలక సంస్థలోని కమిషనర్ చాంబర్లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల అనుమతులకు సంబంధించి ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కంప్యూటీకరించాలన్నారు. ఆన్లైన్ విధానంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే భవనాల క్రమబద్ధీకరణ పథకం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, కంప్యూటరీకరణ చేశారా, ఎన్ని దరఖాస్తులను క్లియర్ చేశారు తదితర వివరాలను సంబంధిత పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరిత గతిన భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, పట్టణ ప్రణాళిక విభాగం అడిషనల్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం, టీపీఎస్‌లో బీఐలు పాల్గొన్నారు. -
'వ్యభిచారం చట్టబద్ధం చేయం'
న్యూఢిల్లీ: దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసే ఎలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం పార్లమెంట్లో వ్యభిచారం చట్టబద్దత అంశంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ రాతపూర్వకంగాపై విధంగా సమాధానం ఇచ్చారు. అయితే మహిళలు అక్రమ రవాణను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే లైంగికదాడికి గురవుతున్న మహిళలను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మేనకా గాంధీ ఈ సందర్బంగా సభకు వివరించారు.