న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను రిటర్ను ఫారంలలో ప్రత్యేకంగా ఉంటుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. క్రిప్టో ఆదాయాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ‘ఈ కరెన్సీలకు సంబంధించిన ట్యాక్సేషన్‌పై స్పష్టత తెచ్చేందుకే ఫైనాన్స్ బిల్లులో వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై పన్నుల నిబంధన చేర్చారు.
ఈ నిబంధనల్లో వీటి చట్టబద్ధత గురించి ఏమీ లేదు. క్రిప్టోకరెన్సీల నియంత్రణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయి‘ అని బజాజ్ తెలిపారు. ‘క్రిప్టో అసెట్స్ ఆదాయంపై పన్ను విధించే విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. అందుకే గరిష్టంగా 30 శాతం రేటు పరిధిలోకి దాన్ని చేర్చాం. టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తింపచేస్తున్నాం.
ఇకపై ఈ లావాదేవీలన్నింటినీ ట్రాక్ చేస్తాం‘ అని ఆయన వివరించారు. క్రిప్టోల చట్టబద్ధత గురించి ప్రస్తావించకుండా.. గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ లావాదేవీల తరహాలోనే ఈ కరెన్సీల ద్వారా వచ్చే లాభాలపైనా 30% పన్ను (సెస్సు, సర్‌చార్జీలు అదనం) విధించాలని బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి పన్ను, జులై 1 నుంచి టీడీఎస్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కూడా క్రిప్టో లాభాలపై పన్ను వర్తిస్తుందని, 2022 ఏప్రిల్ 1కి ముందు చేసిన క్రిప్టో లావాదేవీలను ఐటీఆర్‌లోని ఏదో ఒక హెడ్ కింద చూపితే అసెస్‌మెంట్ అధికారి దానిపై తగు నిర్ణయం తీసుకుంటారని బజాజ్ తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్లకు టెక్నాలజీ తప్ప ఎటువంటి ఆర్థిక విలువ ఉండదు కాబట్టి డిడక్షన్‌లకు తావు ఉండదని ఆయన చెప్పారు.
పన్నుతో మార్కెట్ పరిస్థితి తెలుస్తుంది: సీబీడీటీ చీఫ్ మహాపాత్ర
క్రిప్టో కరెన్సీలపై పన్నుల వడ్డనతో దేశీయంగా ఈ మార్కెట్ ’లోతు’ ఎంత ఉందో తెలుస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర చెప్పారు. అలాగే ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల స్వభావం మొదలైన వివరాల గురించి కూడా వెల్లడవుతుందని పేర్కొన్నారు. అయితే పన్ను విధించడమనేది.. ఈ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎవరైనా సరే డిజిటల్ వ్యాపారం ద్వారా లాభాలు ప్రకటించిన పక్షంలో.. దానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడ నుంచి తెచ్చారన్నది కూడా వెల్లడించాల్సి ఉంటుందని మహాపాత్ర తెలిపారు. ఒకవేళ పెట్టుబడి సరైనదే అయితే లాభాలపై పన్ను వర్తిస్తుందని చెప్పారు. అలా కాకుండా లెక్కల్లో చూపని డబ్బును లేదా బినామీగా ఇన్వెస్ట్ చేసినట్లు తేలితే దానికి అనుగుణంగా ఇతర చర్యలు ఉంటాయన్నారు. ట్యాక్సేషన్ వల్ల ఇవన్నీ బైటపడతాయని మహాపాత్ర చెప్పారు. అనధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి చూస్తే దేశీయంగా క్రిప్టో లావాదేవీల పరిమాణం ఏటా రూ. 30,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకూ ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment