
RBI On Cryptocurrency Control And Digital Currency: క్రిప్టోకరెన్సీ నియంత్రణ చట్టం విషయంలో కేంద్రం ఆచితూచీ వ్యవహరించాలని నిర్ణయించుకుంది. క్రిప్టో కరెన్సీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని ఓవైపు చెబుతూనే.. వాటిని ఆస్తులుగా పరిగణించే దిశగా చట్టంలో మార్పులు చేసినట్లు సంకేతాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో తన స్టాండర్డ్‌ను ప్రకటించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది.
ఈ మేరకు డిసెంబర్ 17న లక్నో(ఉత్తర ప్రదేశ్)లో జరగబోయే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది ఆర్బీఐ. ఆర్బీఐ తరపు నుంచి డిజిటల్ కరెన్సీని(క్రిప్టో పేరుతో కాకుండా) జారీ చేయడం? దాని రూపు రేఖలు.. ఎలా ఉండాలనే అంశాలపై ఓ నిర్ణయానికి రానుంది. ఇక ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?.. ఒకవేళ ప్రైవేట్ క్రిప్టో నియంత్రణ బాధ్యతల్ని ముందుగా అనుకున్నట్లు సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి కేంద్రం అప్పగిస్తే.. ఆ నిర్ణయాన్ని స్వాగతించాలా? లేదంటే వ్యతిరేకించాలా? అనే విషయాలపై బోర్డులో చర్చించనుంది ఆర్బీఐ.
క్లిక్ చేయండి: క్రిప్టోతో పెట్టుకోవడం ఆర్బీఐకి మంచిది కాదు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం (13 డిసెంబర్, 2021)న ఆర్థిక మంత్రిత్వ శాఖ.. క్రిప్టోకరెన్సీ కోసం బిల్లు, నియంత్రణ మీద బిల్లు తుది రూపానికి వచ్చిందని, కేబినెట్ అంగీకారం ఒక్కటే మిగిలిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ వేగం పెంచింది. నిజానికి 17వ తేదీన జరగబోయే ఆర్బీఐ బోర్డు మీటింగ్ ఎజెండాలో ఈ కీలకాంశం ప్రస్తావనే లేదు!. కానీ, ఇలా ఎజెండాలో లేని కీలకాంశాలపై చర్చించడం బోర్డుకు కొత్తేం కాదని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment