Central Revenue Department
-
జీఎస్టీలో ‘మూడు ముక్కలాట’!
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో వృద్ధి మాత్రమే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల పనితీరులో వ్యత్యాసం కూడా కనిపిస్తోంది. జీఎస్టీ కింద పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ని వేల కోట్లు సమీకరించినా అందులో సగం కేంద్రానికి ఇవ్వాల్సి వస్తుండటంతో రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు పాత బకాయిల వసూలుకే ప్రాధాన్యమిస్తున్నారు. అదే తరహాలో కేంద్ర పన్నుల శాఖ అధికారులు కూడా సెంట్రల్ ఎక్సైజ్ పన్నులు, కేంద్రానికి రావాల్సిన పాత బకాయిల వసూళ్లే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. రెండు ప్రభుత్వాల అధికారులూ పాతబకాయిల పైనే దృష్టి పెట్టడంతో డీలర్లు సతమతం కావాల్సి వస్తోందనే చర్చ జరుగుతోంది. ఎప్పుడో ఐదారేళ్ల నాటి బకాయిలు కట్టాలని ఇరు ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే డీలర్లకు నోటీసుల మీద నోటీసులు వెళ్తున్న నేపథ్యంలో ఇంకెన్నాళ్లీ పాత బకాయిల గోల అని వారు పెదవి విరుస్తున్నారు. ఓవైపు పాతబకాయిలు కట్టుకుంటూ పోతే కొత్త పన్నులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని, ఈ విషయంలో ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావాలని కోరుతున్నారు. రూ.3వేల కోట్లపై మాటే.. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ.4వేల కోట్ల వరకు వస్తున్నాయి. జీఎస్టీ కింద ఎంత వసూలు చేసినా అందులో సగం కేంద్రానికి వెళ్తుంది. దీంతో జీఎస్టీ వసూళ్ల కోసం పనిచేస్తున్న రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు కొత్త పన్నులపై కాకుండా పాత బకాయిలపైనే దృష్టి పెడుతుండటం గమనార్హం. జీఎస్టీ అమల్లోకి రాకముందు నుంచీ పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలు, వన్‌టైమ్ సెటిల్మెంట్లు, విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వసూళ్ల కోసమే తాము పనిచేయాల్సి వస్తోందని, ఇప్పటివరకు పాతబకాయిలు రూ.3వేల కోట్లకు పైగానే ఉన్నాయని ఓ అధికారి వెల్లడించారు. తామే కాదని, కేంద్ర పన్నుల శాఖ అధికారులు కూడా కేంద్ర ఖజానాకు వెళ్లే పన్నులపై దృష్టి సారిస్తున్నారే తప్ప రాష్ట్ర ఖజానాకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించడం లేదన్నారు. కనీసం ఇతర రాష్ట్రాల అడ్రస్‌లతో రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్న డీలర్లను కనీసం అప్డేట్ చేయడం లేదని, ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన పన్నులను కూడా ఇవ్వడం లేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే డీలర్లు 3.5 లక్షల వరకు ఉంటారు. అయినా... వసూళ్లలో వృద్ధి జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టకపోయినా వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రూ.3,871 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే గత ఏడాది ఆగస్టులో అయి తే రూ.3,525 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి జీఎస్టీ వసూళ్లలో 20శాతానికి పైగా వృద్ధి కనిపించింది. ఈ ఆర్థిక సంవత్సంలో ఆగస్టు వరకు జీఎస్టీ వసూళ్లు రూ.21,256.97 కోట్లుగా నమోదైంది. గత ఏడాదిలో ఇది రూ.17,226.78 కోట్లు మాత్రమే. గత ఏడాది తో పోలిస్తే 23 శాతం వృద్ధి నమోదైందని అధికారులు చెబుతున్నారు. -
క్రిప్టోకు చట్టబద్ధత వచ్చినట్లు కాదు
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయ పన్ను రిటర్ను ఫారంలలో ప్రత్యేకంగా ఉంటుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. క్రిప్టో ఆదాయాలను కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. ‘ఈ కరెన్సీలకు సంబంధించిన ట్యాక్సేషన్‌పై స్పష్టత తెచ్చేందుకే ఫైనాన్స్ బిల్లులో వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై పన్నుల నిబంధన చేర్చారు. ఈ నిబంధనల్లో వీటి చట్టబద్ధత గురించి ఏమీ లేదు. క్రిప్టోకరెన్సీల నియంత్రణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాతే ఆ వివరాలు వెల్లడవుతాయి‘ అని బజాజ్ తెలిపారు. ‘క్రిప్టో అసెట్స్ ఆదాయంపై పన్ను విధించే విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. అందుకే గరిష్టంగా 30 శాతం రేటు పరిధిలోకి దాన్ని చేర్చాం. టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తింపచేస్తున్నాం. ఇకపై ఈ లావాదేవీలన్నింటినీ ట్రాక్ చేస్తాం‘ అని ఆయన వివరించారు. క్రిప్టోల చట్టబద్ధత గురించి ప్రస్తావించకుండా.. గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ లావాదేవీల తరహాలోనే ఈ కరెన్సీల ద్వారా వచ్చే లాభాలపైనా 30% పన్ను (సెస్సు, సర్‌చార్జీలు అదనం) విధించాలని బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి పన్ను, జులై 1 నుంచి టీడీఎస్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం కూడా క్రిప్టో లాభాలపై పన్ను వర్తిస్తుందని, 2022 ఏప్రిల్ 1కి ముందు చేసిన క్రిప్టో లావాదేవీలను ఐటీఆర్‌లోని ఏదో ఒక హెడ్ కింద చూపితే అసెస్మెంట్ అధికారి దానిపై తగు నిర్ణయం తీసుకుంటారని బజాజ్ తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్లకు టెక్నాలజీ తప్ప ఎటువంటి ఆర్థిక విలువ ఉండదు కాబట్టి డిడక్షన్లకు తావు ఉండదని ఆయన చెప్పారు. పన్నుతో మార్కెట్ పరిస్థితి తెలుస్తుంది: సీబీడీటీ చీఫ్ మహాపాత్ర క్రిప్టో కరెన్సీలపై పన్నుల వడ్డనతో దేశీయంగా ఈ మార్కెట్ ’లోతు’ ఎంత ఉందో తెలుస్తుందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ జేబీ మహాపాత్ర చెప్పారు. అలాగే ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల స్వభావం మొదలైన వివరాల గురించి కూడా వెల్లడవుతుందని పేర్కొన్నారు. అయితే పన్ను విధించడమనేది.. ఈ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సరే డిజిటల్ వ్యాపారం ద్వారా లాభాలు ప్రకటించిన పక్షంలో.. దానికి అవసరమైన పెట్టుబడులు ఎక్కడ నుంచి తెచ్చారన్నది కూడా వెల్లడించాల్సి ఉంటుందని మహాపాత్ర తెలిపారు. ఒకవేళ పెట్టుబడి సరైనదే అయితే లాభాలపై పన్ను వర్తిస్తుందని చెప్పారు. అలా కాకుండా లెక్కల్లో చూపని డబ్బును లేదా బినామీగా ఇన్వెస్ట్ చేసినట్లు తేలితే దానికి అనుగుణంగా ఇతర చర్యలు ఉంటాయన్నారు. ట్యాక్సేషన్ వల్ల ఇవన్నీ బైటపడతాయని మహాపాత్ర చెప్పారు. అనధికారిక లెక్కల ప్రకారం 2017 నుంచి చూస్తే దేశీయంగా క్రిప్టో లావాదేవీల పరిమాణం ఏటా రూ. 30,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్ల వరకూ ఉంటోంది. -
అధియాపై ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియాపై ఈడీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్ మండిపడ్డారు. కుంభకోణాలు చేసిన వారు, వారి సంబంధీకుల విషయంలో రాజేశ్వర్ అనుకూలంగా వ్యవహరించారంటూ ఇటీవల అధియా వ్యాఖ్యానించారు. దీనిపై జూన్ 11న అధియాకు పంపిన లేఖలో రాజేశ్వర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘20 ఏళ్లుగా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారుల నుంచి ‘అద్భుతంగా పనిచేశావంటూ’ ప్రశంసలందుకున్నాను. నేను ఎప్పుడూ తప్పచేయలేదు. మీరు వివిధ సందర్భాల్లో నేను సుప్రీంకోర్టుసహా న్యాయవ్యవస్థనూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించానని తోటి అధికారుల ముందు అవమానకరంగా మాట్లాడారు. అది నన్ను చాలా బాధించింది’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే, రాజేశ్వర్ సింగ్‌పై గతంలో ఇచ్చిన అధికారిక ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ బుధవారం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ లేఖ విషయం బయటకొచ్చింది. -
ఈ-కామర్స్ లావాదేవీలపైనా జీఎస్టీ!
న్యూఢిల్లీ : ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ఈ-కామర్స్ కంపెనీలను కూడా చేర్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ-కామర్స్ లావాదేవీల్లో సరఫరా చేసే చోటు(ప్లేస్ ఆఫ్ సప్లై)కు సంబంధించిన నిబంధనలను కేంద్ర రెవెన్యూ శాఖ రూపొందిస్తోంది. దీనివల్ల ఆన్లైన్ షాపింగ్‌ను పన్ను చట్రంలోకి తీసుకురావడం సులువవుతుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. జీఎస్టీలో ఈ నిబంధనలు చాలా కీలకమని కూడా చెప్పారు. ఎక్కడైతే వస్తువులను కస్టమర్‌కు డెలివరీ చేస్తారో ఆ గమ్యం(డెస్టినేషన్) ఆధారంగా పన్ను విధించనున్నట్లు ఆయన వివరించారు. వస్తువుల సరఫరా ఒకే రాష్ట్రం పరిధిలో(ఇంట్రా-స్టేట్) జరుగుతోందా... ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయా(ఇంటర్ స్టేట్) అనేది కూడా ఈ నిబంధనలవల్ల సులువుగా గుర్తించేందుకు వీలవుతుంది. కాగా, జీఎస్టీ అమలు నిబంధనలు రూపొందించనున్న కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు(సీబీఈసీ).. ముసాయిదా(డ్రాఫ్ట్)ను సిద్ధం చేసిన తర్వాత ఈ-కామర్స్ పరిశ్రమ వర్గాల నుంచి దీనిపై సలహాలు, సూచనలు కోరనున్నట్లు సీబీఈసీ సభ్యుడు వీఎస్ కృష్ణన్ చెప్పారు. దేశీ ఈ-కామర్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.33 వేల కోట్లు)గా అంచనా. కాగా, జీఎస్టీ అమలుకు అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎలాగైనా జీఎస్టీని అమలు చేయాలనేది కేంద్రం ప్రణాళిక. -
కొత్త ఐటీ రిటర్న్ ఫామ్‌ల పునఃసమీక్ష
న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫామ్‌లోని కొన్ని అంశాలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో వీటిని పునఃసమీక్షించనున్నట్లు కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. ఐటీఆర్ ఫామ్‌లను మరింత సరళం చేయాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఫామ్‌ల ద్వారా బ్యాంకు ఖాతాలు, విదేశీ పర్యటనలు, ఆధార్ నంబర్ మొదలైన వాటికి సంబంధించి అవసరమైన దానికన్నా ఎక్కువ సమాచారాన్ని పన్నుల శాఖ రాబట్టేందుకు ప్రయత్నిస్తోం దంటూ పన్నుల నిపుణులు, చెల్లింపుదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తిన దరిమిలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.